Begin typing your search above and press return to search.

ఏపీ సీనే తెలంగాణ‌లో రిపీటా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:51 AM GMT
ఏపీ సీనే తెలంగాణ‌లో రిపీటా ప‌వ‌న్‌?
X
చేయ‌నంటూనే సినిమాలు చేస్తారు. మ‌ధ్య మ‌ధ్య‌లో రెస్ట్ పేరుతో ఎవ‌రికి అందుబాటులోకి రాకుండా ఉండిపోతారు. ప్ర‌జాజీవితంపై ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తూ..నిరంత‌ర ప్ర‌జా యాత్ర పేరుతో నెల‌ల త‌ర‌బ‌డి గ్యాప్ తీసుకొని రాజ‌కీయాలు చేయ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.

సెప్టెంబ‌రు నుంచి రాజ‌కీయాల్లో బిజీగా ఉంటాన‌ని గతంలో చెప్పి.. దాన్ని అక్టోబ‌రుకు వాయిదా వేసిన ప‌వ‌న్‌.. ఆ మ‌ధ్య‌న మూడురోజులు ఏపీలో సంద‌డి చేశారు. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. ఉద‌యం స‌మ‌స్య‌లు స్వీక‌రించ‌టం.. సాయంత్రం వేళ‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భారీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకొని సుదీర్ఘంగా మాట్లాడ‌టం తెలిసిందే. ఈ సంద‌డి త‌ర్వాత ప‌వ‌న్ త‌ర్వాతి అడుగు ఏమిట‌న్న ప్ర‌శ్న తెర మీద‌కు వ‌చ్చేస‌రికి ఆయ‌న అందుబాటులోకి లేకుండా త‌న‌దైన ప్ర‌పంచంలోకి వెళ్లిపోయారు.

అప్ప‌టి నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఏ మాత్రం స్పందించ‌ని ప‌వ‌న్‌.. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వెయిట్ చేసి మ‌రీ.. కేసీఆర్ ను క‌లిసిన ప‌వ‌న్‌.. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పొగిడేయ‌టం ద్వారా ప‌లుచ‌న అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సీఎంతో భేటీ ద్వారా త‌న తీరుపై కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేశారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల కింద‌ట మ‌ళ్లీ త‌న ప‌ర్య‌ట‌న మీద న్యూస్ విడుద‌ల చేసిన ఆయ‌న‌.. ఈ రోజు మ‌ధ్యాహాన్నానికి జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అనంత‌రం క‌రీంన‌గ‌ర్‌కు చేరుకొని స్థానిక నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రప‌నున్న‌ట్లుగా పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం 10.45 గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్ లోని జ‌గిత్యాల రోడ్ లో ఉన్న శుభం గార్డెన్ లో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌.. నిజామాబాద్‌.. అదిలాబాద్ జిల్లాల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం కానున్నారు. బుధ‌వారం మ‌రో మూడు పాత జిల్లాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ కానున్నారు. మొత్తంగా చూస్తే.. ఇదివ‌ర‌క‌టి ప‌ది జిల్లాలకు సంబంధించి ఆరు జిల్లాల్ని తాజా ప‌ర్య‌ట‌న‌తో క‌వ‌ర్ చేస్తార‌ని చెప్పాలి. హైద‌రాబాద్‌..రంగారెడ్డి.. మెద‌క్ (పాత జిల్లాల లెక్క‌లో చూస్తే) మిన‌హాయితే.. ఒక్క జిల్లా మిన‌హాయించి తెలంగాణ మొత్తాన్ని క‌వ‌ర్ చేస్తార‌ని చెప్పాలి. ఏపీలో ఏ విధంగా అయితే.. జిల్లా పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారో అదే రీతిలో తాజా ప్రోగ్రాం ఉంటుంద‌ని చెబుతున్నారు.

కాకుంటే కాస్త ఛేంజ్ ఏమిటంటే.. ఏపీలో స‌మ‌స్య‌ల స్వీక‌ర‌ణ‌.. దానిపై స్పందించ‌టం.. ప్ర‌భుత్వానికి విన‌తులు చేయ‌టం లాంటివి ఉంటే.. తెలంగాణ‌లో మాత్రం అలాంటి కార్య‌క్ర‌మం ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ప‌వ‌న్‌ కు స‌మ‌స్య‌లు చెప్పుకుందామ‌ని వ‌చ్చి.. దాని ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న అంశాల‌పైన ప‌వ‌న్ స్పందించే వీలు ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. ఏపీలో ఏవిధంగా అయితే కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారో తెలంగాణ‌లోనూ అలాంటి సీనే.. తాజా ప‌ర్య‌ట‌న‌లో రిపీట్ అయ్యే అవ‌కాశం ఎక్కువ ఉంద‌ని చెబుతున్నారు.