Begin typing your search above and press return to search.

గవర్నర్ తో భేటీ .. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ పై మళ్లీ మొదలైన ఊహాగానాలు !

By:  Tupaki Desk   |   28 Dec 2020 3:30 PM GMT
గవర్నర్ తో భేటీ .. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ పై మళ్లీ మొదలైన ఊహాగానాలు !
X
బీసీసీఐ అధ్యక్షుడు , మాజీ టీం ఇండియా స్టార్ ఆటగాడు సౌరబ్ గంగూలీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాజకీయలలో హాట్ టాపిక్ గా మారాడు. పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కమలం వైపు వచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ బడా నేతలు ప్రచారం షురూ చేశారు.

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం ఈ ఎన్నికలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలను రాబట్టి.. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చిన కమలదళం అసెంబ్లీ పై కన్నేసింది. దానికి తగ్గ ప్రణాళికలతో ముందుకుపోతుంది. గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఇది వరకే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగానే , ఆదివారం సాయంత్రం.. బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ తో ప్రత్యేకంగా గంగూలీ సమావేశం అయ్యారు. ఈ మాజీ క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో గవర్నర్ ను కలవడం చర్చనీయాంశమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున బెంగాల్‌ అసెంబ్లీకి దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సైతం సాగింది. ఒకవేళ గంగూలీ బరిలో నిలవకపోతే అతని భార్యను పోటీలో నిలపుతారని వార్తలు సైతం వినిపించాయి. అయితే రాజ్భవన్ వర్గాలు మాత్రం గంగూలీ.. మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిశారని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని పేర్కొన్నాయి. గవర్నర్ కూడా కాసేపటికే ట్వీట్ చేశారు. పురాతన క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.