Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో ఆరేళ్లుగా స్పెర్మ్.. భూమ్మీద‌కు తెచ్చాక 168 పిల్ల‌ల జ‌న‌నం!

By:  Tupaki Desk   |   13 Jun 2021 9:30 AM GMT
అంతరిక్షంలో ఆరేళ్లుగా స్పెర్మ్.. భూమ్మీద‌కు తెచ్చాక 168 పిల్ల‌ల జ‌న‌నం!
X
ఈ విశ్వంలో భూమ్మీద త‌ప్ప ఇంకెక్క‌డైనా జీవం ఉందా? మ‌నిషి భూమ్మీద కాకుండా.. మ‌రే గ్ర‌హం మీద‌నైనా నివ‌సించే అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న‌ల‌కు ద‌శాబ్దాలుగా స‌మాధానం వెతుకుతూనే ఉన్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఇందుకోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ప్ర‌యోగాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే.. అంత‌రిక్షంలో జీవం మ‌నుగ‌డ‌కు ఉన్న అవ‌కాశం ఎంత అనేది తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు.

భూమితో పోలిస్తే.. అంత‌రిక్షంలో రేడియేష‌న్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రి, అలాంటి చోట జీవం పుట్టుక‌కు కార‌ణ‌మయ్యే శుక్ర‌క‌ణాలు బ‌తుకుతాయా? అనేది తేల్చ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే 2013లో భూమ్మీద నుంచి అంత‌రిక్షంలోని ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ సెంట‌ర్ కు ఎలుక స్పెర్మ్ (వీర్యం) తీసుకెళ్లారు.

అక్క‌డి వ్యోమ‌గాములు దాన్ని మైన‌స్ 95 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ద్ద ఫ్రీజ‌ర్ లో భ‌ద్ర‌ప‌రిచారు. దాన్ని సుమారు ఆరు సంవ‌త్స‌రాల త‌ర్వాత భూమ్మీద‌కు తిరిగి తెచ్చారు. 2019లో దాన్ని స్పేస్ ఎక్స్ కార్గో క్యాప్సూల్ లో భ‌ద్రంగా తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత దాన్ని ఆడ ఎలుక‌లో ప్ర‌వేశ‌పెట్టి, కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల ద్వారా ఫ‌ల‌దీక‌ర‌ణ చెందించారు.

ఆశ్చ‌ర్యంగా ఆ స్పెర్మ్ నుంచి ఏకంగా 168 పిల్ల‌లు జ‌న్మించాయి. అవి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండ‌డం విశేషం. ఈ ప‌రిశోధ‌న‌ను జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు చేప‌ట్టారు. ఇందుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను ఈ నెల 11న సైన్స్ అడ్వాన్సెస్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురించారు.