Begin typing your search above and press return to search.

విమాన టికెట్లు బుక్ చేసి మరీ తీసుకొస్తున్నారు

By:  Tupaki Desk   |   6 Jun 2020 1:00 PM GMT
విమాన టికెట్లు బుక్ చేసి మరీ తీసుకొస్తున్నారు
X
ట్రెయిన్ రివర్స్ అయ్యింది.. అవును కరోనా-లాక్ డౌన్ వేళ వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. పోయిన వలస కార్మికులు తిరిగి పని ప్రదేశాలకు వస్తున్నాయి. ఎందుకంటే వలస కార్మికులు తరలిపోవడంతో పనులన్నీ ఆగి పోతున్నాయి. కంపెనీలు, కాంట్రాక్టు కంపెనీలకు , రియల్ ఎస్టేట్ రంగానికి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. దీంతో వలస కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఎంత ఖర్చు అయినా.. భారీ రేట్లను ఆఫర్ చేస్తూ అన్ని విధాలుగా వారిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

కేంద్రం లాక్ డౌన్ ను సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి.. గడువులోపు అందివ్వడానికి ఏకంగా వలస కార్మికులకు విమాన టిక్కెట్లు అందిస్తూ.. అదనపు చెల్లింపులు చేస్తామని హామీనిచ్చి కార్మికులను ఆకర్షిస్తున్నాయి. వారిని వెనక్కి రప్పిస్తున్నాయి. ఇలానే బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్లలో ఒకరు హైదరాబాద్‌ లోని ఒక ప్రాజెక్టు లో పని చేయడానికి బీహార్ నుండి 10 మంది కార్పంటర్లను తిరిగి తీసుకు రావడానికి ఏకంగా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేయడం విశేషం.

ప్రాజెక్టుల అమలులో ఆలస్యం వల్ల తమకు కలిగే నష్టాల గురించి ఆందోళన చెందుతున్న కంపెనీలు కార్మికులను తిరిగి తీసుకురావడానికి అదనపు డబ్బు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కూలీ ఎక్కువ ఇస్తామని చెప్పి మరీ వలస కార్మికులను తిరిగి వెనక్కి రప్పిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను రైస్ మిల్లుల్లో పనిచేయడానికి ఒక రైలులో వెనక్కి రప్పించింది. వారికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల పూవ్వులు ఇచ్చి మరీ స్వాగతించారు. భారీ ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు, వలసదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు వారిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులను తిరిగి పంపించాలని తెలంగాణ బీహార్‌కు చేసిన అభ్యర్థన మేరకు వారు తిరిగి వచ్చారు.

తెలంగాణలో 8.5 లక్షల మంది వలస కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ మరియు పరిసరాలలో నిర్మాణ రంగంలో 70 శాతం మంది శ్రామికశక్తి వలస కార్మికులు, ఎక్కువగా బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , ఒడిశా ప్రాంతాల నుండి వచ్చినట్లు అంచనా. అందుకే తెలంగాణ ప్రభుత్వం వారిని తిరిగి నిలబెట్టడానికి తన వంతు కృషి చేసింది. తెలంగాణ అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా పిలిచిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి వలసదారునికి రూ .500, 12 కిలోల బియ్యం ఆర్థిక సహాయం ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూడా కుదేలైన నిర్మాణ రంగాన్ని, వివిధ రంగాలను తిరిగి ప్రారంభించడానికి వలసపోయిన కార్మికులను ఆయా కంపెనీలు, సంస్థలు వెనక్కి రప్పిస్తున్నాయి.

ఇప్పుడు వలస కార్మికులు పోవడంతో దెబ్బతిన్న అన్ని రంగాలు వారికి అధిక కూలీ, విమాన, రైలు టికెట్లు ఆఫర్ చేసి మరీ తిరిగి వెనక్కి రప్పిస్తున్నాయి. పారిశ్రామిక యూనిట్లు, ముఖ్యంగా నిర్మాణ సంస్థలు, కార్మికులను తిరిగి తీసుకురావడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.