Begin typing your search above and press return to search.

డ్యాం బద్ధలయ్యే ముప్పు.. డేంజర్లో ఎన్ ఆర్ ఐలు

By:  Tupaki Desk   |   13 Feb 2017 5:57 AM GMT
డ్యాం బద్ధలయ్యే ముప్పు.. డేంజర్లో ఎన్ ఆర్ ఐలు
X
అమెరికాలోని డ్యామ్ ఒకటి ప్రమాదంలో పడింది. వరదల కారణంగా ఈ డ్యామ్ ఏ క్షణంలో అయినా బద్ధలు అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో.. వేలాది మంది ప్రజల్ని అధికారులు ఇళ్లు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని వోవర్ విల్లే డ్యామ్ ప్రమాదం అంచున ఉంది. ఈ డ్యామ్ స్పిల్ వద్ద గండి పడటం.. మరోవైపు వరద పోటెత్తటంతో.. ఏ క్షణంలో అయినా డ్యాం బద్ధలయ్యే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

దీంతో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్నిగుర్తించిన అధికారులు యుద్ధప్రాతిపదికన ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం కారణంగా ప్రవాసభారతీయులు పెద్ద ఎత్తున ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వరద ముప్పు ఎదుర్కొంటున్నప్రాంతాలకు చెందిన ప్రజల్లోదాదాపు 15 శాతం మంది ప్రవాసభారతీయులేనని చెబుతున్నారు.

ఏళ్ల తరబడి కరవు తర్వాత ఇటీవల కాలంలో కాలిఫోర్నియాలో భారీగా హిమపాతం.. వర్షాల కారణంగా భారీగా నీరు వచ్చి చేరుతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ డ్యాం ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. సెకనుకు లక్ష క్యూబిక్ అడుగుల మేర నీటిని స్పిల్ వే నుంచి వదులుతున్నట్లగా అధికారులు చెబుతున్నారు. స్పిల్ వే వద్ద భారీగా రాళ్లు ఉండటంతో నీళ్లు వేగంగా కదలటం లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నీటి ఒత్తిడి కారణంగా ఏ క్షణంలో అయినా డ్యామ్ బద్ధలు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా సుమారు 16వేల మంది ప్రజలపై ఈ వరదలు ప్రభావం చూపించే వీలుందని చెబుతున్నారు. వరద ముప్పున్న ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అదికారులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్నారు.