Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణ మృదంగం..

By:  Tupaki Desk   |   24 March 2022 2:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణ మృదంగం..
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు నెలరోజుల నుంచి రష్యా ఉక్రెయిన్ పై దాడులను చేస్తోంది. రష్యా సైన్యం ఉక్రెయిన్ లో భారీ విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా సైన్యం దాడికి ఉక్రెయిన్ సైన్యంతోపాటు సాధారణ ప్రజలు సైతం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు ఇప్పుడు ఆహారం కోసం అలమటిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను పూర్తిగా తిప్పికొడుతోంది. చాలా మంది రష్యన్ సైనికులను చంపినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది.

ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఏ దేశం భారీగా నష్టపోయింది.? ఎంత మంది ప్రజలు చనిపోయారన్న లెక్క మాత్రం తేలడం లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ఎంతో మంది మరణించారు. అదేవిధంగా రష్యా కూడా ఎంతో మంది సైనికులను కోల్పోయింది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం 28 రోజుల నుంచి ఇరుదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిందని సమాచారం. ఐక్యరాజ్యసమితి, మీడియా నివేదికల ప్రకారం.. రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ లో 1000 భవనాలు కూలిపోయాయి. దాదాపు 3వేల మంది మరణించినట్లు సమాచారం. రష్యా నిరంతరం చేస్తున్న దాడులతో ఉక్రేనియన్ నగరం మారియుపోల్ పై తీవ్ర ప్రభావం పడింది. నగరంలో ఇప్పటివరకూ దాదాపు 1000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

మారియుపోల్ లోని ఆసుపత్రులు, పాఠశాలలు కూడా నేలమట్టమయ్యాయి. మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ప్రజలు విద్యుత్ , నీరు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. రష్యా దాడి చేసిన నగరాల్లో మారియుపోల్ తీవ్రంగా నష్టపోయింది. కీవ్ పై రష్యా వైఫల్యం తర్వాత మారియు పోల్ నగరంపై దాడి జరుగుతోంది. వేలాది మంది పౌరులు బందీలుగా ఉన్నారు. మారియుపోల్ నుంచి ప్రజలను బలవంతంగా రష్యాకు పంపుతున్నట్టు సమాచారం.

ఇక ఈ యుద్ధంలో 5వేల మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించారని సమాచారం. ఉక్రెయిన్ లో ఇప్పటివరకూ 117 మంది అమాయకులు మరణించారు. మొత్తంగా యుద్ధం ఇరు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.