Begin typing your search above and press return to search.

కూట‌మిలో కుంప‌ట్లు పీక్‌ కు చేరిపోయాయే!

By:  Tupaki Desk   |   22 Oct 2018 1:33 AM GMT
కూట‌మిలో కుంప‌ట్లు పీక్‌ కు చేరిపోయాయే!
X
అధికార పార్టీని గద్దెదించుతామంటూ ఏర్పాటైన మహాకూటమిలోని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కూటమి కోసం అందరికంటే ముందుగా ప్రయత్నాలు చేసిన సీపీఐలో మహాకూటమి పరిణామాలు చిచ్చురేపాయి. కేవలం మూడుసీట్లు తీసుకుని కూటమిలో ఉండాలా? సీనియర్లు స్వలాభం కోసమే కాంగ్రెస్ వెంట వెంపర్లాడుతున్నారంటూ ద్వితీయశ్రేణి నాయకులు మండిపడుతున్నారు. అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని - సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని కూటమిలో భాగస్వామ్యపక్ష పార్టీకి చెందిన సీపీఐ నేత‌లు కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీచేశారు. మఖ్దూంభవన్‌ లో ఆదివారం నిర్వహించిన సీపీఐ సమావేశంలో కూటమి సీట్ల కేటాయింపు అంశంపై వాడివేడి చర్చ జరగ‌గా....మూడు సీట్ల కోసం వెంపర్లాట ఎందుకు అంటూ పెద్ద‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ప‌లువురు నేత‌లు వాకౌట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి హాజరైన స‌మావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి - పల్లా వెంకట్‌ రెడ్డి - గుండా మల్లేశం - పశ్య పద్మ - ఆదిరెడ్డి - కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మూడుసీట్లు మాత్రమే ఇస్తే కూటమి నుంచి బయటకు రావడమే ఉత్తమమని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సీపీఐకి బలం ఉన్న 25 స్థానాల్లో పోటీచేద్దామని సమావేశానికి హాజరైన కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇస్తామన్న మూడు సీట్లు తీసుకుని కూటమి భారాన్ని మోసేకంటే.. ఒంటరిగా బరిలోకి దిగితే వచ్చే నష్టమేమిటని వారు ప్రశ్నించినట్టు సమాచారం.కూటమి సీట్ల కేటాయింపు ఏమాత్రం సబబుగా లేదంటూ సీనియర్ నేత - కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాకూటమితో సీపీఐకి ఒరిగేదేమీలేదని ఖరాఖండిగా చెప్పిన ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్టు మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది.

మహాకూటమి రేపిన సీట్ల చిచ్చుతో సీపీఐ నాయకులు రెండువర్గాలుగా విడిపోయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాడ వెంకటరెడ్డి - కూనంనేని సాంబశివరావు - పల్లా వెంకటరెడ్డి వంటి వారంతా కూటమిలో ఉండాలి.. తమ సీట్ల వరకు వస్తే చాలన్న ధోరణితో ఉన్నారని ఇతర నాయకులు గుర్రుగా ఉన్నట్టు చెప్తున్నారు. కూటమిలో ఉంటే వచ్చే 3-4 సీట్లలో తమకు పోటీచేసే అవకాశం రాదని వారు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మి అనుకూల‌ - వ్య‌తిరేక నేత‌లుగా పార్టీ చీలిపోయిన‌ట్లు తెలుస్తోంది.