Begin typing your search above and press return to search.

ఉత్త‌ర కొరియాలో క‌రోనా వ్యాప్తికి ఆ దేశ‌మే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   2 July 2022 1:30 AM GMT
ఉత్త‌ర కొరియాలో క‌రోనా వ్యాప్తికి ఆ దేశ‌మే కార‌ణ‌మా?
X
రెండేళ్ల క్రితం కోవిడ్ -19 వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వ‌ర్ధమాన దేశాల వ‌ర‌కు అన్ని దేశాలు కోవిడ్ ధాటికి అల్ల‌క‌ల్లోల‌మ‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 80 ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ కు బ‌ల‌య్యార‌ని అధికారిక లెక్క‌లే తెలుపుతున్నాయి. కానీ అంత‌కంటే ఎక్కువ మ‌ర‌ణించి ఉండొచ్చ‌ని అని అంచ‌నా.

కోవిడ్ వైర‌స్ వ్యాప్తిపై అప్ప‌ట్లోనే అమెరికా.. చైనాపై ఆరోప‌ణ‌ల‌కు దిగింది. చైనా ప్ర‌త్య‌ర్థి దేశాల‌ను భ‌య‌పెట్ట‌డానికి ఇలాంటి వైర‌స్ ల‌ను ల్యాబుల్లో సృష్టిస్తోంద‌ని అమెరికా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగింది. ఈ క్ర‌మంలోనే శాస్త్ర‌వేత్త‌లు చేసిన పొర‌పాటుతో కోవిడ్ - వైర‌స్ ల్యాబ్ నుంచి బ‌య‌ట‌కొచ్చింద‌ని ఆరోపించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను చైనా ఖండించింది. ఈ వివాదం ఆ తర్వాత స‌ద్దుమ‌ణిగింది.

ఇప్పుడు తాజాగా మ‌రోమారు ఉత్త‌ర కొరియా.. అమెరికా మాదిరిగానే ఆరోప‌ణ‌లు చేస్తోంది. అయితే ఉత్త‌ర‌కొరియా ఆరోప‌ణ‌లు చేస్తోంది.. చైనా పైన కాదు.. త‌న దాయాది దేశం ద‌క్షిణ కొరియాపైన ఈ విమ‌ర్శ‌లు చేస్తోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర కొరియాలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డుతున్నారు. రెండేళ్ల క్రితం కోవిడ్ విజృంభించిన‌ప్పుడు ఉత్త‌ర కొరియాలో అంత‌గా క‌రోనా కేసులు వ్యాప్తి చెంద‌లేదు. ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా క‌రోనా తీవ్ర‌త త‌గ్గింద‌నుకుంటున్న త‌రుణంలో ఉత్త‌ర కొరియాలో కోవిడ్ వీర‌విహారం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ద‌క్షిణ కొరియాపై మండిప‌డుతున్నారు. ద‌క్షిణ కొరియా నుంచి అనుమానాస్పద రీతిలో వైరస్‌ తమ దేశంలోకి ప్రవేశించిందంటూ కిమ్ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. రెండు దేశాల మ‌ధ్య సరిహద్దుల వెంట‌ ఉన్న ప్రాంతాల్లో గాలి, ఇతర వాతావరణ పరిస్థితులు, బెలూన్లు.. ఇతరత్ర వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల‌ని ఆయ‌న త‌న దేశ‌స్తుల‌ను కోరారు.

కాగా ఉత్త‌ర కొరియాలో ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో కుమ్‌గాంగ్‌ రీజియన్‌లో 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారిలో తొలిసారి వైరస్‌ లక్షణాలు వెలుగుచూశాయి. కొండప్రాంతం నుంచి అనుమానాస్పద కదలికల వల్లే వాళ్లు వైరస్ బారిన పడ్డట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

బెలూన్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరిగింది. ఆపై అదే రీజియన్‌లోని ఇఫో-రి ప్రాంతం నుంచి వచ్చిన కొందరి కారణంగా.. ఉత్తర కొరియా మొత్తం వైరస్‌ వ్యాప్తి చెందింది. దీనంతటికి పొరుగు దేశం కారణమని అత్యున్నత దర్యాప్తులో తేలింద‌ని ఉత్త‌ర కొరియా చెబుతోంది. ద‌క్షిణ కొరియా బయో వార్‌ కోసం ప్రయత్నించార‌ని ఉత్తర కొరియా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది.