Begin typing your search above and press return to search.

ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ బరిలోనే..ఎవరిని దెబ్బకొడుతుందో!

By:  Tupaki Desk   |   29 March 2019 8:12 AM GMT
ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ బరిలోనే..ఎవరిని దెబ్బకొడుతుందో!
X
మొత్తానికి ఎస్పీవై రెడ్డి కుటుంబం ఎన్నికల బరిలోనే నిలుస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో ఏకంగా నాలుగు సీట్లలో నామినేషన్లు దాఖలు చేశారు ఎస్పీవై రెడ్డి కుటుంబీకులు. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా నెగ్గిన ఎస్పీవై రెడ్డి ఫలితాలు వచ్చిన వెంటనే ఫిరాయించిన సంగతి తెలిసిందే. కనీసం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన ఫిరాయించేశారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. ఐదేళ్ల పాటు ఆయనపై అనర్హత వేటు పడనే లేదు.

ఇక ఈ ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా ఉండకపోవడం గమనార్హం. టీడీపీ తరఫున టికెట్ దక్కకపోవడంతో ఎస్పీవై ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన వెంటనే లేట్ లేకుండా జనసేన లోకి చేరి ఏకంగా నాలుగు టికెట్లను సంపాదిచుకున్నారాయన.

నంద్యాల ఎంపీ సీటు - నంద్యాల ఎమ్మెల్యే సీటు - బనగానపల్లె - శ్రీశైలం ఎమ్మెల్యే సీట్లు ఎస్పీవై కుటుంబానికే దక్కాయి. అయితే జనసేన తరఫున నామినేషన్లను వేసినవీరిని విత్ డ్రా చేయించే ప్రయత్నం కూడా జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయంలో స్పందించారు. ఎస్పీవై కుటుంబీకులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని.. తెలుగుదేశం పార్టీకి మద్దతును ఇవ్వాలని.. వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని బాబు నంద్యాల ఎన్నికల ప్రచార సభలో పిలుపునిచ్చారు.

అలాగే ఎస్పీవై రెడ్డిని బరి నుంచి తప్పించేందుకు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నేతలు కూడా ప్రయత్నాలు సాగించారట. అయితే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున ఎస్పీవై అలాంటిపని ఏమీ చేయలేదు. దీంతో ఆయన, ఆయన కుటుంబీకులంతా ఎన్నికల బరిలోనే నిలిచినట్టుగా అవుతోంది.

నంద్యాల ఎంపీ సీటు పరిధిలో ఎస్పీవై రెడ్డి కి బలముంది. వరసగా ఆ సీటునుంచి విజయాలు సాధించారు. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా ఆయన కుటుంబం తరఫు నుంచి అదే సీటు పరిధిలో నలుగురు పోటీలో ఉన్నారు. వీరి ప్రభావం ఈ నియోజకవర్గాల్లో ఎవరిని దెబ్బ కొడుతుందో ఫలితాలు వస్తే కానీ తెలియదు!