Begin typing your search above and press return to search.

బాబుపై నమ్మకం ఉందంటూనే..గుబులు రేపిన ఎస్పీవై!

By:  Tupaki Desk   |   11 March 2019 8:26 AM GMT
బాబుపై నమ్మకం ఉందంటూనే..గుబులు రేపిన ఎస్పీవై!
X
మొన్నేమో.. నంద్యాల ఎంపీ టికెట్ అడిగితే తనతో చంద్రబాబు డబ్బులు అడిగారని, అరవై కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించాలని కోరారని.. ప్రకటించిన ఎస్పీవై రెడ్డి ఇప్పుడు రూటు మార్చారు. ఆత్మీయ సమావేశం అంటూ..అనుకూలురుతో సమావేశం నిర్వహించిన ఎస్పీవై రెడ్డి… ఈ సందర్భంగా ఆసక్తిదాయకమైన ప్రకటన చేశారు. తనకు ఇంకా నమ్మకం ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు. చంద్రబాబుపై నమ్మకం ఉందని, తనకే ఎంపీ టికెట్ దక్కుతుందని ఎస్పీవై రెడ్డి అనుచవర్గం ముందు విశ్వాసం వ్యక్తం చేశారు!

ఈ రోజు ఆత్మీయ సమావేశంలో ఎస్పీవై కీలక ప్రకటన చేయనున్నారని.. తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడం కూడా ఖాయమని ప్రచారం జరిగింది. అయితే.. ఎస్పీవై మాత్రం పార్టీని వీడే ప్రకటన చేయలేదు. తనకే టికెట్ దక్కుతుందని మాత్రం చెప్పు కొచ్చారు.

ఈఈ నేపథ్యంలో నంద్యాల వ్యవహారం మళ్లీ ఆసక్తిదాయకంగా మారింది. నంద్యాల ఎంపీ టికెట్ శివానందరెడ్డికి ఖరారు అయినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఎస్పీవై మాట్లాడుతూ.. తనకే టికెట్ అని ప్రకటించుకున్నారు.

అంతే కాదు.. ఇంతకు మించిన సంచలనం రేపారు ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకే ఖరారు అయినట్టుగా ప్రచారం చేసుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే టికెట్ విషంలో భూమా బ్రహ్మానందరెడ్డి పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకే టికెట్ ఖరారు అయ్యిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ తనకు దక్కుతోందని అంటూ చెప్పి గందరగోళాన్ని రేపారు.

తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న వారికి తగిన గుర్తింపు లేదని, కనీసం పదిశాతం గుర్తింపు లేని వాళ్లు కూడా ఎస్పీవైతో పోటీ పడాలని ప్రయత్నిస్తున్నారని.. వారెవరూ ఎస్పీవైకి ధీటైన వారు కాదని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ సందర్భంగా ఎస్పీవై అనుచవర్గం మాట్లాడుతూ.. తమ నేత ఎలా చెబితే అలా అని అన్నారు. ఎస్పీవై రెడ్డికి టీడీపీ టికెట్ దక్కితే తాము ఆ పార్టీలో ఉంటామని.. లేకపోతే రాజీనామానే అని వారు తేల్చి చెప్పారు. ఎస్పీవై రెడ్డి వేరే పార్టీలోకి చేరినా..ఇండిపెండెంట్ గా పోటీ చేసినా.. తాము మద్దతును ఇస్తామని ఆయన అనుచవర్గం ప్రకటించింది. మరి నంద్యాల కథను చంద్రబాబు నాయుడు ఏం తేలుస్తారనేదాన్ని బట్టి ఎస్పీవై వర్గం పయనం ఉంటుందని స్పష్టం అవుతోంది.