Begin typing your search above and press return to search.

అన్న‌గారి ఇల్లు అమ్మకానికి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   3 Nov 2017 5:34 AM GMT
అన్న‌గారి ఇల్లు అమ్మకానికి వ‌చ్చింది
X
ఎన్టీవోడ‌న్న మాట ఇప్ప‌టికి తెలుగోళ్ల‌కు తెలీని ఎన‌ర్జీని ఇస్తుంటుంది. ఆ పేరు మీద రాజ‌కీయాలు చేసే వాళ్లు.. అధికారంలోకి వ‌చ్చే వాళ్లు కొంద‌రైతే.. గుండెల నిండా నింపుకున్న అభిమానాన్ని ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా ప్ర‌ద‌ర్శించే తెలుగోళ్లు కోట్ల‌ల్లోనే ఉన్నారు.

అంద‌రిని వ‌దిలేసి ఎన్టోవోడు వెళ్లిపోయి ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోయినా.. ఆయ‌న ప్ర‌స్తావ‌న వ‌చ్చిన వెంట‌నే ఒక ఉత్సాహం ఆటోమేటిక్ గా వ‌చ్చేస్తుంది. అధికార‌.. విప‌క్షాల‌న్న తేడా లేకుండా ఏదో సంద‌ర్భంలో అన్న‌గారి ప్ర‌స్తావ‌న తేకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

చివ‌ర‌కు ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ.. ఆంధ్రా.. తెలంగాణ అన్న విభ‌జ‌న తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం.. ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఒక్క మాట అన‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. నిజానికి ఎన్టీవోడి మీద త‌న‌కున్న అభిమానంతోనే త‌న కొడుకు పేరును తార‌క‌రామారావు అని పెట్టుకున్న‌ట్లుగా చెబుతారు.

ఇలా కోట్లాది మంది తెలుగోళ్ల గుండెల్లో చెర‌గ‌ని చిరునామాల ఉండే ఎన్టీవోడి ఇల్లు ఇప్పుడు అమ్మాకానికి వ‌చ్చిందా? అంటే అవున‌నే చెబుతున్నారు.

చెన్నై టీ న‌గ‌ర్ లోని 28 బ‌జుల్లా రోడ్ ఉన్న అన్న‌గారి నివాసాన్ని అమ్మ‌కానికి పెట్టిన‌ట్లుగా అక్క‌డి బోర్డు చెబుతోంది. ఈ బోర్డు చూసిన ప్ర‌తి ఒక్క‌రూ అయ్యో అనుకుంటున్న ప‌రిస్థితి. ఇక‌.. తెలుగువారైతే విల‌విల‌లాడిపోతున్నారు. ఎన్నో అనుభూతుల‌కు నిల‌య‌మైన ఇంటిని అమ్మ‌కానికి ఎందుకు పెట్టిన‌ట్లు? త‌న‌ను ఎవ‌రైనా కొంటారా? అని అన్న‌గారిల్లు దీనంగా ఎదురు చూడ‌టం ఏమిటి? తెలుగు నేల మీద ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగిన పేరు ఎన్టీఆర్ దే. అలాంటి వ్య‌క్తికి చెందిన ఇల్లు అమ్మ‌కానికి పెట్ట‌టం ప్ర‌భుత్వానికి ఎందుకు తెలీలేదు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

అన్న‌గారి వార‌స‌త్వాన్ని అందుకోవ‌టానికి.. ఆయ‌న‌తో త‌మ‌కున్న బీర‌కాయ పీచు సంబంధాన్ని గొప్ప‌గా చెప్పుకునే వారు.. సొంతోళ్లు ఇల్లు అమ్మ‌కానికి పెట్టేస్తుంటే ఎందుకు ఊరుకున్న‌ట్లు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

ఎన్టీఆర్ ఒక‌ప్పుడు నివ‌సించిన ఈ ఇల్లు అమ్మ‌కానికి ఉందన్న బోర్డుతో పాటు.. బ్రోక‌ర్ ఏలుమ‌లై పేరు.. సెల్ ఫోన్ నెంబ‌రు ఆ ఇంటికి వేలాడుతోంది. తెలుగోడి ఆస్తిత్వానికి చిరునామాగా నిలిచే ఎన్టీవోడి ఇంటిని అమ్మ‌కానికి పెట్టిన వైనంపై రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది.