Begin typing your search above and press return to search.

ఐసిస్ చావ‌లేదు!..శ్రీ‌లంక మార‌ణ‌హోమం వారి ప‌నే!

By:  Tupaki Desk   |   23 April 2019 2:09 PM GMT
ఐసిస్ చావ‌లేదు!..శ్రీ‌లంక మార‌ణ‌హోమం వారి ప‌నే!
X
ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్‌) చ‌నిపోలేదు. ఇరాక్ లో ఏళ్ల త‌ర‌బ‌డి సాగిన యుద్ధంలో ఆ ఉగ్ర‌వాద సంస్థ మూలాల‌న్నీ అంత‌మ‌య్యాయ‌ని - ఇక ఆ సంస్థ చ‌నిపోయిన‌ట్టేన‌ని అంతా భావించారు. అయితే శ్రీ‌లంక‌లో దారుణ మార‌ణ హోమం సృష్టించి 321 మందిని పొట్ట‌న‌బెట్టుకోవ‌డంతో పాటుగా వంద‌లాది మందిని గాయాల‌ పాల్జేసి త‌న ఉనికి ఆ సంస్థ మ‌రోమారు బ‌లంగానే చాటుకుంది. రెండు రోజుల క్రితం శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోతో పాటు మ‌రో రెండు న‌గ‌రాల్లో చ‌ర్చిలు, హోట‌ళ్లే ల‌క్ష్యంగా సాగిన దాడులు ప్ర‌పంచ దేశాల‌ను దిగ్బ్రాంతికి గురి చేశాయి. అయితే గ‌తంలో ఎప్పుడు దాడులు చేసినా... వెనువెంట‌నే వీడియోల ద్వారా స‌ద‌రు ప‌నులు త‌మ‌వేనంటూ ఐసిస్ ప్ర‌క‌టిస్తూ వ‌చ్చింది. అయితే శ్రీ‌లంక దాడుల విష‌యంలో రెండు రోజుల దాకా అస‌లు ఆ సంస్థ నుంచి ప్ర‌క‌ట‌నే రాలేదు.

అయితే ఆల‌స్యంగా వ‌చ్చినా ఆ సంస్థ విడుద‌ల చేసిన వీడియోలు ఇప్పుడు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌ను రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు ఐసిస్ అధికారిక వెబ్ సైట్.. అల్-అమక్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐసిస్ చీఫ్ పేరరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ సందేశాన్ని జారీ చేసినట్లు అల్-అమక్ ప్రకటించింది. *శ్రీలంకలో క్రైస్తవులు - పాశ్చాత్య ప్రజలపై చోటు చేసుకున్న పరిణామాలకు ఇస్లామిక్ స్టేట్ యోధులే కారణం* అనేది స్థూలంగా ఆ సందేశానికి సంబంధించిన సారాంశం. *ఈ రక్తపాతాన్ని మీకు రివార్డుగా ఇస్తున్నాం* అంటూ మరో వీడియోను కూడా ఆ సంస్థ విడుద‌ల చేసింది.. ఈ వీడియోను అల్ ఘురాబా మీడియా ప్రసారం చేసింది. ఈ మీడియా సంస్థను ఐసిస్ సానుభూతిపరులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అబుల్ బర్రా, అబుల్ ముఖ్తార్, అబు ఉబైదా పేర్లతో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఈ వీడియోలో ముసుగులు వేసుకుని కనిపించారు.

ఈ ముగ్గురిలో అబూ ఉబైదా అనే ఉగ్రవాది అసలు పేరు జహ్రెయిన్ హాషిమ్ అని, నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థలో కీలక సభ్యుడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కొలంబోలోని షాంగ్రిలా హోటల్ పై జహ్రెయిన్ స్వయంగా ఆత్మాహూతి దాడి చేసినట్లు సమాచారం. ముస్లిం మత ప్రబోధకుడిగా జహ్రెయిన్ పనిచేసే వాడని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టిదాకా ప్ర‌చారంలో ఉన్న‌ట్లుగా న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో మసీదులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మందికి మృత్యువాత పడిన ఘటనకు ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్లుగా ఐసిస్ ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ- క్రైస్ట్ చర్చ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఉగ్రవాదులు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని శ్రీలంక రక్షణ శాఖ సహాయమంత్రి రువాన్ విజేవర్ధనె ప్రకటించిన విషయం తెలిసిందే.

దాడుల అనంతరం దర్యాప్తును ముమ్మరం చేసిన శ్రీలంక పోలీసులు సిరియా జాతీయుడిని అరెస్టు చేశాయి. దీనితో- ఐసిస్ తో సంబంధాలు ఉండి ఉండొచ్చంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ.. తాజాగా ఐసిస్ ఈ సందేశాన్ని, వీడియోను అధికారిక వెబ్ సైట్ లో ప్రచురించింది. శ్రీలంక మారణకాండకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. తమ ఆత్మాహూతి దళ సభ్యులు ఈ దాడులు చేశారంటూ ఓ సందేశాన్ని తమ అధకారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. మొదట్లో శ్రీలంకకే చెందిన నేషనల్ తౌహీత్ జమాత్ అనే ర్యాడికల్ సంస్థ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థకు ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు, భారత్ లో సక్రియంగా ఉన్నట్లుగా భావిస్తోన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కొలంబోలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సిరియా జాతీయుడిని పోలీసులు అరెస్టు చేయడం, ఆ వెంటనే- ఆత్మాహూతి దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటిచండం వంటి పరిణామాలు వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే... దాడుల‌కు సంబంధించి ఇప్పుడు మీడియాలో ప్ర‌సార‌మ‌వుతున్న వీడియో ఒక‌టి పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. ఆత్మాహూతి దళ సభ్యునిగా అనుమానిస్తోన్న యువకుడొకడు భుజానికి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని, క్రిక్కిరిసిన చర్చి లో ప్రవేశిస్తున్న‌ తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కొలంబోలో బాంబు దాడికి గురైన ఓ చర్చి ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ యువకుడు ఈస్టర్ సండే సందర్భంగా చర్చ్ వద్ద వందల సంఖ్యలో భక్తులు గుమికూడి ఉండగా.. ఎలాంటి బెరుకు లేకుండానే వారిని దాటుకుని చర్చిలోనికి ప్రవేశిస్తున్న దృశ్యాలు తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.