Begin typing your search above and press return to search.

తప్పును అంగీకరించిన అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   20 April 2022 5:30 AM GMT
తప్పును అంగీకరించిన అధ్యక్షుడు
X
యావత్ దేశం చేస్తున్న ఆందోళనలను తట్టుకోలేక చివరకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దిగొచ్చారు. తాను చేసిన తప్పుల కారణంగానే దేశం సంక్షోభంలో కూరుకుపోయినట్లు అంగీకరించారు. చేసిన తప్పును సరిదిద్దుతానని ప్రజలకు అధ్యక్షుడు హామీఇచ్చారు.

తన మాటలను నమ్మాలని, తొందరలోనే దేశాన్ని సంక్షోభంలో నుండి బయటకు తీసుకొస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు. కొత్తగా నియమితులైన 17 మంది మంత్రులతో జరిగిన సమావేశంలో గొటబాయ తన తప్పును అంగీకరించారు.

నిజానికి శ్రీలంక హఠాత్తుగా ఏమీ సంక్షోభంలోకి కూరుకుపోలేదు. కొంతకాలంగా ఆర్ధిక పరిస్ధితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. మితిమీరి చేసిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు పెరిగిపోయాయి. పైగా దేశాన్ని అభివృద్ధి చేసే కారణంతో ఓడరేవుల్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నింటినీ అధ్యక్షుడు చైనాకు కట్టబెట్టేశారు. దీనివల్ల శ్రీలంక భూభాగంపై డ్రాగన్ ఆధిపత్యం మొదలైంది. దీన్నికూడా స్ధానికులు సహించలేకపోయారు.

అభివృద్ధిచేసే నెపంతో చైనా అవసరమైన దానికన్నా ఎక్కువ అప్పులిచ్చింది. చైనా ఇస్తోంది కదాని శ్రీలంక కూడా అప్పులు తీసేసుకుంది. ఆ లప్పులే ఇఫుడు శ్రీలంక మెడకు చుట్టుకున్నాయి. ఇదే సమయంలో అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో వ్యవసాయం దెబ్బతినేసింది. రశాయన ఎరువుల వాడకాన్ని దూరంపెట్టి, సంప్రదాయ సేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అనుకున్నది.

అనుకున్న వెంటనే రైతులను మానసికంగా ప్రిపేర్ చేయకుండా ఒక్కసారిగా ఎరువులు, పురుగుమందులను నిలిపేసింది. దాంతో రైతులు వ్యవసాయం చేయలేక వదిలేశారు. దాంతో ఆహారోత్పత్తి తగ్గిపోయి కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి విజృంభించేసరికి పర్యాటకం పూర్తిగా దెబ్బతినేసింది. దీనిమీద ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి.

దాంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి అనేక నిర్ణయాల కారణంగానే శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపధ్యంలోనే తాను చేసిన తప్పులను అధ్యక్షుడు అంగీకరించిన తర్వాత జనాల ఆలోచనల్లో మార్పులొస్తాయా ? లేకపోతే పదవిలో నుండి దిగిపోయేవరకు ఆందోళనలు చేస్తునే ఉంటారా అన్నది చూడాలి.