Begin typing your search above and press return to search.

ఏపీలో రోడ్డెక్కబోతున్న సాధువులు... ఏం జరగనుంది...?

By:  Tupaki Desk   |   19 April 2022 10:30 AM GMT
ఏపీలో రోడ్డెక్కబోతున్న సాధువులు... ఏం జరగనుంది...?
X
సాధువులు అంటే మఠాలలో పీఠాలలో మాత్రమే ఉంటారు. ముక్కు మూసుకుంటారు. తపస్సు చేసుకుంటారు. మరి వారికి ఐహికపరమైన వ్యవహారాలు తోస్తాయా అంటే ధర్మ పరిరక్షణకు తాము తపస్సు చేస్తామని, అవసరం అయితే తామే బయటకు వచ్చి ఆ ధర్మ సంస్థాపన కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. కాకినాడలోని శ్రీపీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఈ మేరకు ఒక కార్యాచరణను ప్రకటించారు. తొందరలోనే స్వామీజీలు అంతా కలసి ఏపీలో భారీ ఎత్తున ధర్మ యాత్రను చేపడతారు అని చెబుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ సాధువులు, స్వాములంతా ఏకబిగిన ధర్మయాత్ర పేరిట సుదీర్ఘమైన పాదయాత్రను నడుం బిగిస్తున్నారు. అలుపెరగని తీరులో సాగే ఈ ధర్మ యాత్రలో హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ప్రజలకు చైతన్యపరుస్తామని అంటున్నారు.

ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో సాధువులు, సన్యాసులు పాల్గొనబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీలో ఇలాంటి యాత్ర జరగలేదు, ఉత్తర భారతాన సాధుసంతులు ఇలాంటి హిందూ చైతన్య యాత్రలు చేపట్టారు. అయితే ఏపీలో హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోందని, అందుకే ధర్మానికి పట్టిన పీడ, చీడలను తొలగించాలన్న ఉద్దేశ్యంతోనే యాత్రను భారీ ఎత్తున చేపడుతున్నట్లుగా పరిపూర్ణానంద చెప్పారు.

దీనికి సంబంధించిన తేదీలను తొందరలోనే ఖరారు చేసి ప్రకటిస్తామని ఆయన అంటున్నారు. ఈ ధర్మ యాత్రలో భాగంగా కోటి మంది హిందువులను వివిధ జిల్లాలలో కలుస్తామని అంటున్నారు. ఇలాగే ఊరుకుంటే హిందూ ధర్మానికి కలిగే ముప్పుని వివరించి వారిని కూడా హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. తాము కేవ‌లం హిందువులనే కలుస్తామని, వారినే జాగృతపరుస్తామని పరిపూర్ణానంద స్పష్టం చేశారు.

ఈ మహా పాదయాత్రలో ఎవరికీ అదిరేది లేదు, బెదిరేదిలేదు అని ఆయన అంటున్నారు. హిందూ చైతన్యం సత్తా చూపిస్తామని ఆయన చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో కాషాయ ద్వజాన్ని ఏపీలో ఎగరేస్తామని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. సాధువులు రోడ్డెక్కబోతున్నారు. ఈ నిర్ణయం జరిగిపోయింది. దీని ఎవరూ ఆపలేరు అని కూడా ఆయన అంటున్నారు. అతి పెద్ద ప్రయత్నానికి తొందరలోనే ముహూర్తం పెడతామని ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి ఏపీలో చూస్తే రాజకీయంగా ఈ సాధువుల భారీ ధర్మ యాత్ర అతి పెద్ద కలకలమే రేపే అవకాశం ఉంది అంటున్నారు. ఈ యాత్ర పరిణామాలు, పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక కాషాయ ద్వజం ఏపీలో ఎగరవేస్తామ‌ని స్వామీజీ అంటున్నారు. ఆయన గతంలో బీజేపీ తరఫున తెలంగాణాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇపుడు ఏపీని కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో కాషాయ‌ సత్తా చాటుతామని అంటున్నారు అంటే ఆ కధ ఏంటో చూడాల్సిందే మరి.