Begin typing your search above and press return to search.

తొక్కిస‌లాట‌పై శ్రీ‌రామ్ సేన కొత్త వాద‌న‌

By:  Tupaki Desk   |   23 July 2015 9:07 AM GMT
తొక్కిస‌లాట‌పై శ్రీ‌రామ్ సేన కొత్త వాద‌న‌
X
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా తొలిరోజు రాజ‌మండ్రి పుష్క‌ర‌ఘాట్ వ‌ద్ద చోటు చేసుకున్న తొక్కిస‌లాట తెలిసిందే. ఈ ఘోర దుర్ఘ‌ట‌న‌లో 27 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఏపీ ముఖ్య‌మంత్రి రెండు గంట‌ల‌కు పైగా పూజ‌లు చేస్తూ.. షూటింగ్ లో పాల్గొన‌టం.. ఏపీ ముఖ్య‌మంత్రి ఘాట్ లో ఉన్న స‌మ‌యంలో భ‌క్తుల‌ను పుష్క‌ర స్నానం చేసేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌టం.. బాబు వెళ్లిన త‌ర్వాత గేట్ల‌ను వ‌దిలిపెట్ట‌టంతో పాటు.. పోలీసు బ‌ల‌గాలు వెళ్లిపోవ‌టం లాంటి కార‌ణాల‌తో తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోయేందుకు కార‌ణం అయ్యింద‌ని ఇప్ప‌టివ‌ర‌కూ తెలిసిన వాద‌న‌.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై శ్రీ‌రామ్ సేన స‌రికొత్త వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న‌లో నిజం ఎంత ఉంద‌న్న‌ది ఒక సందేహం అయితే.. ఈ కోణంపై ఏ మీడియా సంస్థ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క వార్త‌ను ఇవ్వ‌లేదు. కానీ.. శ్రీ‌రామ్‌సేన రాష్ట్ర అధ్య‌క్షుడు బండారు ర‌మేష్ స‌రికొత్త వాద‌న‌ను వినిపిస్తున్నారు. నిజానికి ఆయ‌న వాద‌న కొంత వివాదాస్పదం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఆయ‌న వాద‌న ప్ర‌కారం.. గోదావ‌రి పుష్క‌రాల్ని విఫ‌లం చేసేందుకు మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ప్ర‌య‌త్నించార‌ని.. ఆయ‌న‌కు తోడుగా క్రైస్త‌వ సంఘాలు కుట్ర ప‌న్నాయ‌ని చెప్పుకొచ్చారు. తొక్కిస‌లాట‌కు కార‌ణం క‌రెంటు వైర్లు తెగిప‌డ్డాయంటూ చేసిన పుకార్లే.. మృతుల సంఖ్య మ‌రింత పెరిగేందుకు కార‌ణ‌మైంద‌ని వ్యాఖ్యానించారు.
అయితే.. శ్రీ‌రామ్ సేన వాద‌న‌లో ప‌స లేద‌న్న మాట వినిపిస్తోంది. నిజంగా అదే జ‌రిగితే.. ఒక్క రాజ‌మండ్రిలోనే ఎందుకు జ‌ర‌గాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌రిన్ని చోట్ల జ‌ర‌గాలి క‌దా? అంతేకాదు.. ఇలాంటి ఉదంతాల‌పై నిఘా సంస్థ‌లు ముందుగా ప‌సిగ‌ట్ట‌కుండా ఉంటాయా?

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి ఎలాంటి అరెస్ట్ లు కూడా కాలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని వ‌దిలి పెట్టి.. సంచ‌ల‌నం కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

కాగా.. శ్రీ‌రామ్ సేన అధ్య‌క్షుడు ఏవైతే ఆరోప‌ణ‌లు చేశారో.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఏపీ క్యాబినెట్ స‌మావేశంలో ఇలాంటి సందేహాలు వ్య‌క్తం చేశార‌న్న మాట వినిపిస్తోంది. క‌రెంటు తీగ‌లు తెగి ప‌డ్డాయ‌ని ప‌లువురు అర‌వ‌టంతోనే.. ఇంత భారీ దారుణం చోటు చేసుకుంద‌ని.. తొక్కిస‌లాట‌లో విద్రోహ కోణం ఉంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశార‌ని చెబుతున్నారు. మంత్రి స్థాయి వ్య‌క్తి ద‌గ్గ‌రున్న స‌మాచారం ఏపీ నిఘా సంస్థ‌ల ద‌గ్గ‌ర లేదా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మారింది. ఇలాంటి వాద‌న‌పై ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌క‌ట‌న చేయం మంచిది.