Begin typing your search above and press return to search.

ఒంటిమిట్ట తప్ప అన్నిచోట్ల రామయ్య కల్యాణమే

By:  Tupaki Desk   |   15 April 2016 7:07 AM GMT
ఒంటిమిట్ట తప్ప అన్నిచోట్ల రామయ్య కల్యాణమే
X
దేశం మొత్తం శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడికక్కడ పందిళ్లు వేసి.. రాములోరి కల్యాణాల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర విభజన ముందు వరకూ తెలుగు ప్రజలకు శ్రీరామనవమి అంటే గుర్తుకు వచ్చేది భద్రాచలం రామయ్యే. తెలుగు వారికి అయోధ్యనగరిగా భావించే భద్రాచలం విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోవటంతో.. ఏపీ సర్కారు నవమి వేడుకల్ని అధికారికంగా నిర్వహించటానికి వీలుగా కడపజిల్లా ఒంటిమిట్టను ఎంపిక చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా రాముల వారి కల్యాణం నవమి నాడు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత ఐదో రోజున జరుతుంది. అంతేకాదు.. రాములోరి కల్యాణం పౌర్ణమి వేళ జరగటం ఒంటిమిట్ట ప్రత్యేకత.

భద్రచాలం పుణ్యక్షేత్రం ప్రత్యేకత అందరికి తెలిసిందే. ఒంటిమిట్ట ప్రత్యేకత.. ప్రశస్తికి పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ.. చరిత్రలోకి వెళితే.. ఒంటిమిట్ట రాములోరి ప్రత్యేకతలెన్నో అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

= తన కల్యాణం పౌర్ణమిరోజునే జరుగుతుందని రామయ్యే స్వయంగా చంద్రుడికి చెప్పి వరమిచ్చారని చెబుతారు.

= భద్రాచలం రామాలయం కంటే ఎంతో ముందుగా ఒంటిమిట్ట ఆలయం ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. శాసనాల ప్రకారం 700 ఏళ్ల కిందటే ఒంటిమిట్ట ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పొచ్చు.

= వివిధ సందర్భాల్లో లభించిన శాసనాల ప్రకారం ఒంటిమిట్ట క్షేత్రం గొప్పతనాన్ని చెప్పే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని చూస్తే.. శ్రీకృష్ణ దేవరాయుల అస్థానంలోని అయ్యల రాజు రామభద్రుడి చిన్నతనంలో జరిగిన ఘటనగా దీన్ని చెబుతారు. 1550 ప్రాంతంలో పది నెలల వయసులో ఉన్నప్పుడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయాడట. లోపల బాలుడిని చూడక అర్చకులు గుడి తలుపులు వేసి.. పక్కరోజు తలుపులు తీసే సమయానికి బుగ్గకు పాలు అంటుకొని ఉన్న పిల్లాడు ఆనందంగా కనిపించాడట. అది చూసిన అర్చకులు.. స్వయంగా ఆ సీతమ్మ తల్లే పిల్లాడికి పాలిచ్చి ఆకలి తీర్చిందని చెప్పేవారు.

= 1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్ ఆ ప్రాంతంలో పని చేసేవాడు. ఒకసారి ఒంటిమిట్టకు వచ్చిన ఆయన.. మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నిస్తే.. మనస్ఫూర్తిగా పిలిస్తే పలుకుతారని అక్కడి వారు సమాధానం ఇచ్చారట. దీంతో ఆలయం తలుపు వద్దకు వెళ్లిన ఆయన మూడుసార్లు పిలవగా.. ‘‘ఓ..’’ అని బదులిచ్చినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఇమాంబేగ్ రామభక్తుడిగా మారిపోయాడు.

= ఒంటిమిట్టకు పక్కనే ఉండే మాలకాటిపల్లెలోని మాల ఓబన్న చిన్నతనం నుంచే పాటలు బాగా పాడేవాడు. రామకీర్తనలు పాడుకుంటూ గడిపేవాడు. ఒబన్నను అంటరానివాడిగా పేర్కొంటూ గుడి నుంచి పంపించేస్తే.. సమీపంలో చెరువు కట్ట దగ్గర పాటలు పాడుకుంటూ ఉండేవాడ. పక్కరోజు ఆలయాన్ని తెరిచిన పూజారులకు రాములోరి విగ్రహం ఓబన్న కూర్చున్న వైపుకు తిరిగి ఉండటాన్ని గుర్తించారట. తర్వాత ఓబన్నను గుడికి తీసుకొచ్చిన తర్వాత విగ్రహం యథాస్థానానికి వచ్చిందని ప్రజలు చెప్పుకుంటారు.