Begin typing your search above and press return to search.

ఏడు వందల ఏళ్లుగా ఆ గుడిలో దీపం వెలుగుతూనే ఉందట.. ఎక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   19 April 2022 8:30 AM GMT
ఏడు వందల ఏళ్లుగా ఆ గుడిలో దీపం వెలుగుతూనే ఉందట.. ఎక్కడో తెలుసా?
X
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుడికి నిత్యం దీపారాధన చేస్తుంటాం. అలా కుదరని వాళ్లు వారంలో రెండు సార్లయినా అంటే తమకు నచ్చిన రోజుల్లో దేవుడి గదిలో దీపం పెడ్తుంటారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో అఖండ దీపం అని చెప్పి రెండు రోజులు లేదా నవరాత్రులప్పుడు తొమ్మిది రోజుల పాటు వెలిగేలా చర్యలు తీసుకుంటారు.

ఎప్పుడూ అక్కడే ఒకరు ఉంటూ మరి దీపం కొండెక్కకుండా చూసుకుంటారు. అయితే ఓ గుడిలో మాత్రం ఏకంగా ఏడు వందల సంవత్సరాల నుంచి దీపం ఏలా వెలుగుతూనే ఉందట.

ఆ దీపం కారణంగానే ఈ ఊరి ప్రజలు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో హాయిగా జీవిస్తున్నారట. అవునా ఏడు వందల ఏళ్ల నుంచి దీపం అలాగే ఉందా అనుమానం వస్తోందా.. అవునండి ఇధి నిజమే. నమ్మడానికి కాస్త అనుమానంగా ఉన్నా ఇదే సత్యం. అయితే ఇదెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీ సీతారాస్వామి దేవాలయంలో. అయితే ఈ గుడిలో ఉన్న నంద దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుందట.

దాదాపు 1314 సంవత్సరంలో గంభీరావు పేట మండల కేంద్రంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల కాలంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు ఈ గుడిని కట్టించినట్లు గుడిపై చెక్కిన అంకెల ఆధారంగా గుర్తించారు. అంతటి ప్రాచీన ఆలయంలో ఉన్న నంద దీపమే ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు గుడి నిర్మాణ సమయంలో వెలిగించిన నంద దీపం నాటి నుంచి నేటి వరకు నిత్యం వెలుగుతూనే ఉంది. దీని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాతో ఉంటున్నారని భక్తుల నమ్మకం.

ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన దీపాన్ని నిరంతరం వెలిగించడానికి అప్పటి రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులో కొంత డబ్బుని దీపం నూనె కోసం వాడేవారని చరిత్ర చెబుతోంది. రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గ్రామానికి చెందిన దాతనే నంద దీపానికి ఇస్తున్నారు. గంభీరావుపేటకు చెందిన అయిత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం నూనెను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఇప్పటికీ నంద దీపం వెలుగుతోంది.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా కన్నులపండువగా కళ్యాణం జరిపిస్తారు. ఆ సమయంలో గుడితో పాటు నంద దీపాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. గుడి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం 16 స్తంభాలతో చతురస్రాకారంలో అతి సుందరంగా రాతితో నిర్మించారు. ఆలయ ప్రత్యేకతల్లో ఇదొకటి. స్వామి వారి కల్యాణం, నంద దీపం చూడాలంటే పెట్టి పుట్టాలని ప్రజలు చెబుతున్నారు.