Begin typing your search above and press return to search.

అంతిమయాత్రలోనూ శ్రీదేవి రికార్డు?

By:  Tupaki Desk   |   28 Feb 2018 4:31 PM GMT
అంతిమయాత్రలోనూ శ్రీదేవి రికార్డు?
X
అర్ధశతాబ్దం పాటు వెండితెరపై అలరించి అశేషాభిమానులను సంపాదించుకుని అర్ధాంతరంగా తనువు చాలించిన సినీ నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబయిలో జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముంబయిలో రాజకీయేతరుల అంతిమయాత్రల్లో ఇదే అత్యంత భారీదని చెప్తున్నారు.

బుధవారం ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి ముందు శ్రీదేవి పార్థివదేహంపై జాతీయ జెండాను ఉంచి, ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను శ్రీదేవి కుటుంబం మీడియాకు విడుదలచేసింది. ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు కంచి పట్టు చీరను ఆమెకు చుట్టారు. ఆమెకు అత్యంత ఇష్టమైన మల్లెలతో శవపేటికను అలంకరించారు. దేశం నలుమూలల నుంచి సినీ - రాజకీయ ప్రముఖులెందరో శ్రీదేవి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ముంబయిలో రాజకీయేతర ప్రముఖల అంతిమయాత్రల్లో మహ్మద్ రఫీదే రికార్డని ఇంతవరకు చెబుతూ వస్తుంటారు. 1980లో మరణించిన ఆయన అంతిమ యాత్రలో 10 లక్షల మంది పాల్గొన్నారని చెప్తారు. ఆ తరువాత 2012లో రాజేష్ ఖన్నా అంతిమయాత్రలోనూ దాదాపుగా అంతేమంది పాల్గొన్నారు. 1988లో రాజ్ కపూర్ - 2017లో వినోద్ ఖన్నా అంతిమయాత్రల్లోనూ లక్షలాది మంది పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీదేవి అంతిమయాత్రలో 10 లక్షల కంటే ఎక్కువమంది పాల్గొన్నట్లు భావిస్తున్నారు.