Begin typing your search above and press return to search.

శ్రీదేవి.. 240 కోట్ల ఇన్సూరెన్స్.. ఒక మిస్టరీ

By:  Tupaki Desk   |   11 May 2018 11:12 AM GMT
శ్రీదేవి.. 240 కోట్ల ఇన్సూరెన్స్.. ఒక మిస్టరీ
X
శ్రీదేవి మరణించి అప్పుడే రెండున్నర నెలలు దాటిపోయాయి. అతిలోక సుందరి అభిమానులు ఆమె మరణాన్ని దిగమింగుకుని ఎవరి పనుల్లో పడిపోయారు. ఐతే శ్రీదేవి అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది.. అంత చిన్న బాత్ టబ్ లో పడిపోయి ఆమె చనిపోవడమేంటి.. అసలు శ్రీదేవి సమస్య ఏంటి..? ఆమెకున్న అనారోగ్యమేంటి..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు. శ్రీదేవిది అనుమానాస్పద మరణం కాదనే విషయాన్ని దుబాయ్ పోలీసులే తేల్చేశారు. ఇక ఇండియన్ పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే శ్రీదేవి మృతిపై సందేహాలతో ఉన్న కొందరు వ్యక్తులు ఆమె మృతి వెనుక రహస్యాల్ని ఛేదించేందుకు పట్టుదలతోనే పోరాడుతున్నారు. తాజాగా సునీల్ సింగ్ అనే ఫిలిం మేకర్ శ్రీదేవి మరణంపై స్వతంత్ర విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పటికే ఢిల్లీ కోర్టులో వేసిన అతడి పిటిషన్ తిరస్కరణకు గురవగా.. తాజాగా అతను సుప్రీం కోర్టుకు వెళ్లాడు. కానీ అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది.

కానీ ఆ వ్యక్తి శ్రీదేవి మృతి విషయంలో వ్యక్తం చేసిన సందేహాలు.. ఆమె ఇన్సూరెన్స్ కు సంబంధించిన వెల్లడించిన వివరాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒమన్ లో శ్రీదేవి పేరిట రూ.240 కోట్లకు జీవిత బీమా తీసుకున్నారట. ఆమె దుబాయ్ లో కనుక చనిపోతే రూ.240 కోట్లు వచ్చేలా బీమా ఒప్పందం జరిగినట్లు అతను వెల్లడించాడు. దీన్ని బట్టి శ్రీదేవి మృతిలో ఏదో మిస్టరీ ఉందని పిటిషనర్ ఆరోపించాడు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న శ్రీదేవి 5 అడుగుల పొడవున్న బాత్ టబ్ లో పడి చనిపోవడంపైనా అతను సందేహాలు వ్యక్తం చేశాడు. సునీల్ సింగ్ చెబుతున్నట్లు ఇన్సూరెన్స్ వివరాలు నిజమైతే మాత్రం శ్రీదేవి మృతిని సందేహించాల్సిందే.