Begin typing your search above and press return to search.

బోనీ స‌ర్ ప్రైజ్ డిన్న‌ర్ కు వెళ్లే క్ర‌మంలో శ్రీ‌దేవి మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   25 Feb 2018 11:17 PM GMT
బోనీ స‌ర్ ప్రైజ్ డిన్న‌ర్ కు వెళ్లే క్ర‌మంలో శ్రీ‌దేవి మ‌ర‌ణం
X
బాలీవుడ్ తొలి సూప‌ర్ స్టార్‌.. తెలుగోళ్ల వ‌సంత కోకిల శ్రీ‌దేవి మ‌ర‌ణానికి సంబంధించిన వార్త‌లు ఇప్పుడిప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆమె మ‌ర‌ణంపై తొలుత వ‌చ్చిన వార్త‌ల‌కు భిన్నంగా.. కాస్తంత క్లారిటీతో ఇప్పుడు వివ‌రాలు వెల్ల‌డ‌వుతున్నాయి. పెళ్లి వేడుక‌కు వెళ్లి.. తిరిగిన వ‌చ్చాక శ్రీ‌దేవికి కార్డిక్ అరెస్ట్ కు గుర‌య్యార‌ని.. బాత్రూంలోనే స్పృహ కోల్పోయిన‌ట్లుగా చెప్పారు. తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆమె మ‌ర‌ణానికి నాలుగు రోజులు (దుబాయ్ లో ఆమె ఆఖ‌రి శ్వాస తీసుకున్న‌ది ఫిబ్ర‌వ‌రి 24న‌) ముందు పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

పెళ్లి త‌ర్వాత ర‌స్ అల్ ఖైమా నుంచి బోనీ ఫ్యామిలీ దుబాయ్‌కు చేరుకున్నారు. అక్క‌డి హోట‌ల్లో శ్రీ‌దేవి ఉండిపోగా.. ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ముంబ‌యి తిరిగి వెళ్లారు. దుబాయ్ కాల‌మానం ప్ర‌కారం 24 సాయంత్రం బోనీక‌పూర్ హోట‌ల్ కు వెళ్లారు. అనంత‌రం స‌ర్ ప్రైజ్ డిన్న‌ర్ కు ప్లాన్ చేశారు.

ఈ సంతోషంలో డిన్న‌ర్ కు వెళ్ల‌టానికి రెఢీ అయ్యేందుకు శ్రీ‌దేవి బాత్రూంకు వెళ్లారు. అయితే.. బాత్రూంకు వెళ్లిన పావు గంట‌కు కూడా ఎలాంటి అలికిడి లేక‌పోవ‌టంతో భ‌ర్త బోనీ త‌లుపు త‌ట్టారు. ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌టంతో త‌లుపును బ‌లంగా తెరిచే ప్ర‌య‌త్నం చేశారు. ఇదంతా దుబాయ్ కాల‌మానం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 24న సాయంత్రం 5.30 గంట‌ల వేళ‌లో అని చెబుతున్నారు.

హోట‌ల్ సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌టం.. ఆ పై త‌న స్నేహితుడికి బోనీ క‌పూర్ ఫోన్ చేసి ప‌రిస్థితి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దుబాయ్ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. ఆ రోజు రాత్రి 9 గంట‌ల వేళ‌లో పోలీసుల‌కు శ్రీ‌దేవి ఉదంతాన్ని వారికి స‌మాచారం అందించిన‌ట్లు చెబుతున్నారు. ఎవ‌రైనా ఆసుప‌త్రిలో మ‌ర‌ణిస్తే వారే పోలీసుల‌కు స‌మాచారం అందిస్తారు. శ్రీ‌దేవి విష‌యంలోనూ అదే జ‌రిగింది. హోట‌ల్ గ‌దిలోనే ఆమె స్పృహ త‌ప్పి ఉండ‌టం.. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణంపై సందేహాల‌తో పోలీసుల‌కు స‌మాచారం అందించిన‌ట్లుగా చెబుతున్నారు.

శ్రీ‌దేవి మ‌ర‌ణం అనంత‌రం ఆమె భౌతిక‌కాయాన్ని తిరిగి తెచ్చేందుకు భార‌త ప్ర‌భుత్వంలోని అత్యున్న‌త స్థాయి అధికారులు రంగంలోకి దిగిన‌ట్లుగా తెలుస్తోంది. దుబాయ్ అధికార వ‌ర్గాల‌కు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ప‌లువురు పెద్ద‌లు నేరుగా రంగంలోకి దిగారు. కానీ.. శ‌నివారం మ‌ర‌ణించిన శ్రీ‌దేవి సోమ‌వారం సాయంత్రానికి ముంబ‌యికి చేరుకునే వీలుంద‌ని చెబుతున్నారు.

ఇందుకు కార‌ణం దుబాయ్లోని చ‌ట్టాలేన‌ని తెలుస్తోంది. అక్క‌డి చ‌ట్టాల్ని విదేశీ ఎంబ‌సీలు.. ప్ర‌భుత్వాల ప్ర‌భావం ఎంత‌మాత్రం ప‌ని చేయ‌వు. రూల్స్ ప్ర‌కార‌మే ప‌ని చేస్తాయి. శ్రీ‌దేవి విష‌యంలోనూ అలానే జ‌రిగింది. ఇందుకు ఉదాహ‌ర‌ణ ఏమిటంటే.. పోస్ట్ మార్ట‌మ్ త‌ర్వాత ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు పూర్తి అయి.. వారు నివేదిక ఇవ్వాలి. అయితే.. పోస్ట్ మార్ట‌మ్‌.. ఇత‌ర వైద్య ప‌రీక్ష‌లు పూర్త‌య్యేస‌రికి ఆఫీస్ ప‌నిగంట‌లు ముగిశాయి. దీంతో.. ప‌రీక్ష నివేదిక‌ల్ని పూర్తిగా అధ్య‌య‌నం చేయ‌నిదే తుది నివేదిక‌ను జారీ చేయ‌లేన‌ని ఈ ప‌నికి బాధ్యులైన డాక్ట‌ర్ ఖాలీద్ అల్ అబురైఖీ స్ప‌ష్టం చేశారు.

దీనికి త‌గ్గ‌ట్లే వైద్యుల నివేదిక రాకుండా మృత‌దేహాన్ని తాము అప్ప‌గించ‌లేమ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు (సోమ‌వారం ) ఉద‌యం ప‌ని వేళ‌లు మొద‌లైన త‌ర్వాత శ్రీ‌దేవి మ‌ర‌ణానికి సంబంధించిన వైద్య నివేదిక‌ల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి. ఆమె మ‌ర‌ణానికి సంబంధించిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇస్తారు. అనంత‌రం పోలీసులు క్లియ‌రెన్స్ ఇస్తారు. ఆ త‌ర్వాతే శ్రీ‌దేవి పార్థిప‌దేహాన్ని ముంబ‌యికి తిరిగి వ‌చ్చే ప్రక్రియ త్వ‌ర‌గా ముగిసి గంట‌ల్లో దేశానికి తిరిగి వ‌చ్చే వీలుంది.