Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి రియాక్ష‌న్‌ తో తెరాస షాక్‌..!

By:  Tupaki Desk   |   10 July 2016 8:15 AM GMT
మాజీ మంత్రి రియాక్ష‌న్‌ తో తెరాస షాక్‌..!
X
ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పార్టీల‌కు - వ్య‌క్తుల‌కు షాక్ ఇస్తూ వ‌చ్చిన తెలంగాణ అధికార పార్టీ తెరాస‌కు కాంగ్రెస్ మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌ బాబు గ‌ట్టి షాకిచ్చారు. అదేంటి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న అధికార‌పార్టీకి షాక్ ఇవ్వ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా? నిజ‌మే! దుద్దిళ్ల ఇచ్చిన షాక్‌ తో ఖంగుతిన‌డం సీఎం కేసీఆర్ వంతైంద‌ట‌! అంతేకాదు.. అంద‌రికీ షాకిచ్చే నాకే శ్రీథ‌ర్ షాకిస్తాడా అని కేసీఆర్ సైతం షాక్ అయిన‌ట్టు తెరాస వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్‌. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే రాష్ట్ర విభ‌జ‌న‌ - తెలంగాణలో కేసీఆర్ హ‌వా నేప‌థ్యంలో హ‌స్తం పార్టీ నేతలంద‌రూ వ‌రస‌పెట్టి అధికార తెరాస‌లోకి జంప్ చేసేస్తున్నారు. తెరాస‌ నుంచి రా.. ర‌మ్మ‌ని ఆహ్వానం అందిన‌వాళ్లు, అంద‌ని వాళ్లు సైతం గులాబీ కండువా క‌ప్పేసుకున్నారు. ఇంతవ‌ర‌కు తెరాస‌కు బాగానే క‌లిసొచ్చింది అని ముచ్చ‌ట ప‌డిపోయార‌ట కేసీఆర్ అనుచ‌ర‌గ‌ణం.

ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మంచి పేరున్న శ్రీథ‌ర్‌ బాబుకు కూడా ఓ ప‌ద‌వి ఇస్తాన‌ని..తెరాస‌లోకి రావాల‌ని మ‌ధ్య‌వ‌ర్తుల‌తో ఆఫ‌ర్ క‌బురు పంపార‌ట‌. ఇంత‌లో ఓ పెద్ద కుదుపు! కాంగ్రెస్ నుంచి వ‌చ్చి తెరాస‌ కారెక్కుతార‌ని భావించిన ఆయ‌న‌ ఒక్క‌సారిగా ట్విస్ట్ ఇచ్చారు. శ్రీధ‌ర్ బాబు మీడియా ముందుకు వ‌చ్చి త‌ను పార్టీ మారుతానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు త‌న‌కు పార్టీ మారే ఉద్దేశం కానీ, అవ‌స‌రం కానీ లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ లో భాగంగా ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, వీటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ బాబు - సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్సాహిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బంగారు తెలంగాణా సాధించాలంటే చిత్త‌శుద్ధి ఉండాలని, ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను ఎలా లాక్కుందామా అని ఆలోచిస్తుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌కు కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం లేద‌ని, ఆ పార్టీలోనే కొన‌సాగుతూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డ‌తాన‌ని శ్రీధ‌ర్ బాబు వెల్ల‌డించారు. శ్రీధ‌ర్ బాబు సీరియ‌స్ వ్యాఖ్య‌లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలోనూ న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ వంటి వారు ఇంత‌క‌న్నా సీరియ‌స్‌గానే తెరాస‌పైనా, సీఎం కేసీఆర్‌ పైనా విరుచుకుప‌డ్డారు. ఆన‌క మాత్రం అంతా క‌ట్ట‌గ‌ట్టుకుని కారెక్కేశారు. మ‌రి శ్రీథ‌ర్ బాబు ఏం చేస్తారో చూడాలి.