Begin typing your search above and press return to search.

సొంత జిల్లాలోనే అచ్చెన్న‌కు ఎర్త్ త‌గిలిందే!

By:  Tupaki Desk   |   4 Oct 2017 10:00 AM GMT
సొంత జిల్లాలోనే అచ్చెన్న‌కు ఎర్త్ త‌గిలిందే!
X
నిజాయితీ, నిజానికీ తాము నిలువుట‌ద్దాన్న‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడిపై ఆయ‌న సొంత జిల్లా శ్రీకాకుళం ప్ర‌జ‌లే ఫైరైపోతున్నారు. ఆయ‌న‌ మాటలు విని మోసపోయామని మెట్‌ కోర్‌ ఎల్లాయిస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఇనుము ఉత్పత్తి పరిశ్రమ) కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు రావివలసలో ఉన్న ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. గత మూడేళ్ల నుంచి పూర్తి స్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.

దాదాపు 200మంది కార్మికులు ఫ్యాక్టరీ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వేతనాల విషయమై కార్మికులంతా ఫ్యాక్టరీ హెచ్ ఆర్ మేనేజర్ రామారావును నిలదీశారు. తక్షణమే బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు. ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోయిందని కుంటిసాకులు చెప్పి 2015 మే 22న లాకౌట్‌ ప్రకటించారని కార్మిక నాయకులు అన్నారు. అప్పటికే 6 నెలల బకాయి జీతాలతో పాటు 2014 నుంచి పీఎఫ్ - గ్రాట్యూటీ - రన్నింగ్‌ బోనస్‌ చెల్లించకపోవడంతో..అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పలుమార్లు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు.

వేతనాల్లో 60 శాతం కార్మికులకు చెల్లించేలా యాజమాన్యంతో చర్చించామని, పరిశ్రమను పూర్తి స్థాయిలో తెరిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చినట్లు గుర్తుచేశారు. మంత్రి గారు హామి ఇచ్చి మూడేళ్లు గడిచిపోయినా.. కంపెనీ మాత్రం తమ వేతనాలు చెల్లించలేదన్నారు. దశాబ్దాలుగా పరిశ్రమను నమ్ముకున్న కార్మికులకు తక్షణం న్యాయం జరగకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మ‌రి మంత్రిగారు వీరి డిమాండ్‌ పై ఏమంటారో చూడాలి. ఏదేమైనా సొంత జిల్లాలోనే మంత్రికి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచ‌డం అచ్చ‌న్న అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.