Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్ బీజేపీ అభ్య‌ర్థిగా శ్రీ‌క‌ళారెడ్డి... ఈమెవ‌రో తెలుసా..?

By:  Tupaki Desk   |   25 Sep 2019 9:32 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్ బీజేపీ అభ్య‌ర్థిగా శ్రీ‌క‌ళారెడ్డి...  ఈమెవ‌రో తెలుసా..?
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ క్ర‌మంలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన పేరు శ్రీ‌క‌ళారెడ్డి. ఇప్పుడామె పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. కిందిస్థాయి రాజ‌కీయ శ్రేణులే కాదు.. సామాన్య ప్ర‌జ‌లు కూడా శ్రీ‌క‌ళారెడ్డి గురించి తెలుసుకునేందుకు ఆస‌క్తిచూపుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రామె..? రాజ‌కీయ నేప‌థ్యం ఏమిటి..? బీజేపీలోకి ఎప్పుడు వ‌చ్చారు..? అని మీకూ తెలుసుకోవాల‌ని ఉందా..? అయితే.. ఈక‌థ‌నం చ‌దవండిక‌.. శ్రీకళారెడ్డి ది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబ‌మే. ఆమె తండ్రి జితేందర్ రెడ్డి. తొలిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఒకానొక ద‌శ‌లో జైలుకు కూడా వెళ్లారు. గతంలో ఆయ‌న‌ కోదాడ ఎమ్మెల్యేగా కూడా ప‌ని చేశారు.

ఇక శ్రీ‌క‌ళారెడ్డి భ‌ర్త‌ బీఎస్పీ తరఫున యూపీ నుంచి 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. అక్క‌డ ఆయ‌న‌కు బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు ఉంద‌ట‌. ఇక టీడీపీలో ఉన్న‌ప్పుడు శ్రీ‌క‌ళారెడ్డి ప‌లుమార్లు కోదాడ‌ - హుజూర్‌ న‌గ‌ర్ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ.. ఆమెను టికెట్ వ‌రించ‌లేదు. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీడీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మార‌డంతో ఆమె ఇటీవ‌లే బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అధిష్ఠానం శ్రీ‌క‌ళారెడ్డికే టికెట్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాదాపుగా కోర్‌ క‌మిటీలో కూడా నిర్ణ‌యం జ‌రిగింద‌ని - అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ అభ్యర్థులకు బలమైన అభ్యర్థి శ్రీకళారెడ్డినేనని బీజేపీ భావిస్తోందని - ఆమెకే టికెట్ దక్కే చాన్స్ ఉందని పార్టీ సీనియర్ ఒకరు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీజేపీకి కేవ‌లం 1500ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక నోటాకు 1620ఓట్లు వ‌చ్చాయి. అంటే.. నోటా కంటే త‌క్కువే వ‌చ్చాయ‌న్న‌మాట‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏకంగా బీజేపీ నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీకి పాజిటివ్ వేవ్ మొద‌లైంది. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల నుంచి చేరిక‌లు కూడా బాగా పెరిగాయి. ఈ నేప‌థ్యంలోనే హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ స‌త్తా చాటుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్ పార్టీలు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థుల‌కు సీట్లు ఇవ్వ‌డంతో బీజేపీ సైతం అన్ని విధాలా బ‌లంగా ఉన్న శ్రీక‌ళారెడ్డి అభ్య‌ర్థిత్వం వైపే మొగ్గు చూపుతోంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌క‌ళారెడ్డి కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుస్తామ‌ని అంటున్నారు. ప్ర‌జ‌లు - యూత్ బీజేపీ వైపే ఉన్నార‌ని ఆమె అంటున్నారు. మ‌రి హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ కాసిన్ని ఓట్లు సాధించి ప‌రువు నిలుపుకుంటుందా ? లేదా ? లోక్‌ సభ ఎన్నిక‌ల్లోలా సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందా ? అన్న‌ది చూడాలి.