Begin typing your search above and press return to search.

వైసీపీ క్లారిటీఃరాష్ట్రప‌తి ఎన్నిక వ‌ర‌కే మా మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   13 May 2017 4:50 AM GMT
వైసీపీ క్లారిటీఃరాష్ట్రప‌తి ఎన్నిక వ‌ర‌కే మా మ‌ద్ద‌తు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి స‌మావేశంపై అధికార తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు మ‌రోమారు క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ఎప్పటికీ బీజేపీకి వ్యతిరేకమేనని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌ రెడ్డి - కె.శ్రీనివాసులు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని ప‌లు స‌మ‌స్య‌లు తెలియ‌చేసేందుకు, రాష్టప్రతి ఎన్నికల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపేందుకు మాత్ర‌మే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల ప్రధానిని కలిసి మద్దతు ప్రకటించారని స్ప‌ష్ఠం చేశారు. ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఉలికిపాటు ఎందుకని ప్ర‌శ్నించారు.

టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆయన అవినీతి అక్రమాలు భయటపడకుండా కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీని - కేంద్ర మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. తమ నేత ఏనాడు ఎవరినీ కలవలేదని కేవలం రాష్ట్రప‌తి ఎన్నిక కోసమే ప్రధానిని కలిశారని తెలిపారు. తాము బీజేపీతో పొత్తులో ఉండబోమని, ఎన్‌ డిఏకు మద్దతు ఇవ్వమని రాష్టప్రతి ఎన్నికవరకే బీజేపీకి మద్దతు ఇస్తామన్నారు. టీడీపీ నేతలు నోరును అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. చంద్రబాబునాయుడు ఏలుబ‌డిలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి అక్రమాలు, దోపిడీపై తమనేత ఫిర్యాదు చేశారని వాటిని కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశంపార్టీ నేతలు తమపై, తమనేతపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో చంద్రబాబునాయుడు ప్రతినిత్యం అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తో - కేంద్ర ఆర్థికశాఖ మంత్రితోనూ తరచు కలిసి జగన్‌ పై కేసులు బనాయించాలని వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాత్రనక పగలనకా ప్రదర్శనలు చేయలేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతులు - ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే కరవు విలయతాండవం చేస్తుంటే బాబు విదేశ పర్యటనలకు వెళ్లి విహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. జనాకర్షణ - ప్రజాకర్షణ కలిగిన తమ నాయకుడిని ఓదార్పు యాత్రలకు ప్రజా ఆందోళన ఉద్యమాలకు లక్షలాది మంది ప్రజలు హాజరౌతుంటే తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకిరావడం తధ్యమని జోస్యం చెప్పారు. తమ నేతను తమ పార్టీని విమర్శించే నైతికహక్కు టీడీపీకి లేదన్నారు. చంద్రబాబునాయుడుతోపాటు ఆయన అనుచరగణం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుబోయేవరకు తమనేత చేస్తున్న ఆరోపణలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తాము ప్రజాసమస్యలపట్ల స్పందిస్తుంటే తమ నాయకుడిని ఇబ్బందిపెట్టాలని ప్రయత్నంచేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైసీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/