Begin typing your search above and press return to search.

హరీశ్ కనిపించరా శ్రీకాంత్ రెడ్డి..?

By:  Tupaki Desk   |   23 Jun 2016 11:51 AM GMT
హరీశ్ కనిపించరా శ్రీకాంత్ రెడ్డి..?
X
కృష్ణా జలాల వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీ అందరికి తెలిసిందే. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా తమ తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తున్న సంగతి మీడియాలో వస్తున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ విపక్ష నేతలకు ఏపీ మంత్రి దేవినేని ఉమ చేతకానితనం మాత్రమే కనిపించటం గమనార్హం. తాజగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడిన ఆయన.. సీమకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదంటూ ఫైర్ అయ్యారు.

కృష్ణా జలాల పంపిణీ విషయంలోరాష్ట్ర ప్రయోజనాలను దేవినేని ఉమ తాకట్టు పెట్టినట్లుగా ధ్వజమెత్తారు. ఒకవేళ అదే నిజమైతే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేత దొబ్బులు తినాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. అయినా.. ఏపీ మంత్రి దేవినేని ఉమను విమర్శిస్తున్న శ్రీకాంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర వైఖరిని ఎందుకు తప్పు పట్టటం లేదన్నది ఒక ప్రశ్న.

కేంద్ర స్థాయిలో ఇరు వర్గాలు పోటాపోటీగా తమ వాదనలు వినిపిస్తూ.. తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదంటూ తేల్చి చెబుతున్నా.. శ్రీకాంత్ రెడ్డికి దేవినేని ఉమ చేస్తున్న ప్రయత్నాలుకనిపించకపోవటం చూసినప్పుడు.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏపీ ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలే ఎక్కువన్న భావన కలుగుతుందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు. నిజంగానే దేవినేని తప్పులు చేసి ఉంటే.. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలే తప్పించి.. ఆ విషయాల్ని వదిలేసి.. విమర్శలు చేయటం సరికాదు. ఏపీ సర్కారును విమర్శిస్తున్న శ్రీకాంత్ రెడ్డి అంతకు ముందు.. తెలంగాణ అధికారపక్షం చేస్తున్న వాదనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏమిటి? అన్నది స్పష్టం చేస్తే బాగుంటుంది.