Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో సహా పరారైన మాజీ ప్రధాని.. వైరల్

By:  Tupaki Desk   |   10 May 2022 3:40 PM GMT
ఫ్యామిలీతో సహా పరారైన మాజీ ప్రధాని.. వైరల్
X
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దేశం ఇప్పుడు ప్రజల నిరసనలతో అట్టుడుకుతోంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు రాజకీయ సంక్షోభం కారణంగా దేశం చిమ్మి చీకట్లో కమ్ముకుంది. కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం ఏకంగా దేశ ప్రధాని నివాసం ముందు ఆందోళనకారులు నిరసనకు దిగారు. మహింద రాజపక్స అనుచరులపై దాడికి దిగారు. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసం ఎదుట నిరసనకారులపై మహింద రాజపక్స అనుచరులు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకారులు శ్రీలంక ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా టార్గెట్ చేశారు. రాజపక్స నివాసం ఉన్న ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్ బిల్డింగ్ వద్దకు చేరుకొని ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే బారికేడ్లు దాటుకొని వెళ్లాలని ప్రయత్నించిన వారిని పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. కాంపౌండ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఆ దేశ ప్రధాని పదవికి మహింద రాజపక్స ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ మాజీ ప్రధాని, ఆయన కుటుంబం నేవీ బేస్ లో ఆశ్రయం పొందినట్లు తెలిసింది. ట్రింకోమలీలోని నేవీ బేస్ లో మాజీ ప్రధాని రాజపక్స ఆయన కుటుంబం తలదాచుకున్నట్లు సమాచారం.

ఆందోళనకారులు మాజీ ప్రధాని ఇంటిని ముట్టడించడంతో హెలిక్యాప్టర్ లో రాజపక్స, ఆయన కుటుంబం కొలంబో నుంచి నేవీ బేస్ కు చేరుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఆందోళనకారులు అక్కడికి చేరుకొని నిరసన బాట పట్టారు.

రాజపక్స ప్రస్తుతం కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నేవీ బేస్ కొలంబో నగరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారిక నివాసం ఖాళీ చేసి నేవీ బేస్ లో రాజపక్స తలదాచుకున్న వార్తలు రాగానే ఆ సమీప ప్రాంతాల నుంచి ఆందోళనకారులు అక్కడికి చేరుకొని మరోసారి నిరసనలతో హోరెత్తించారు.

పరిస్థితులు అదుపు తప్పడంతో శ్రీలంక ప్రభుత్వం మంగళవారం మిలటరీకి, పోలీసులకు ఎమర్జెన్సీ అధికారాలు అప్పగిస్తూ నిర్ణయించింది.