Begin typing your search above and press return to search.

ఆసియా కప్ విజేత శ్రీలంకకు టీ20 వరల్డ్ కప్ లో షాకిచ్చిన నమీబియా

By:  Tupaki Desk   |   16 Oct 2022 8:42 AM GMT
ఆసియా కప్ విజేత శ్రీలంకకు టీ20 వరల్డ్ కప్ లో షాకిచ్చిన నమీబియా
X
ఆసియాకప్ లో తొలి మ్యాచ్ లోనే అప్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత పుంజుకొని ఏకంగా భారత్, పాకిస్తాన్ లాంటి బలమైన జట్లను ఓడించి ఆసియాకప్ కొట్టేసింది. తొలి ఓటమి నుంచి కసిగా రగిలి కప్ అందుకుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ తొలి మ్యాచ్ లోనూ ఆసియాకప్ విజేతకు ఆనందం నిలవలేదు. పసికూన నమీబియా చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఆసియా కప్ విజేతకు ఇది సరైన స్ట్రాట్ కాదనే చెప్పాలి. శ్రీలంక లాంటి బలమైన జట్టు ఇలా దారుణంగా పసికూన నమీబియా చేతిలో ఓడడం అందరికీ షాక్ కు గురిచేసింది.

టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ లో నమీబియా బలమైన శ్రీలంకను చిత్తు చేసింది. ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్ లోకి అడుగుపెట్టిన లంక జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఏకంగా 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ సంచలనంతోనే మొదలైంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆదివారం సైమండ్స్ స్డేడియంలో జరిగింది. శ్రీలంక కెప్టెన్ ధనుస్ షనక టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. వెంటవెంటనే ఓపెనర్లు అవుట్ అయ్యారు. దీంతో చివరి ఐదు ఓవర్లలో ధాటిగా ఆడడంతో 7 వికెట్లకు నమీబియా 163 పరుగులు చేసింది.

అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు బాటపట్టారు. అందరూ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో 108 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. దీంతో తొలి మ్యాచ్ లోనే బలమైన శ్రీలంక ఓడి టోర్నీలో సంచలనం నమోదైంది.