Begin typing your search above and press return to search.

స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉన్నారంటున్న శ్రీనివాస్

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:16 AM GMT
స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉన్నారంటున్న శ్రీనివాస్
X
అధికారపక్షంపై విపక్షాలు విమర్శలు చేయటం కామన్. కానీ.. స్వపక్షం వారే విమర్శలు చేస్తే..? అది కూడా అధికారపక్షం తీరును నిశితంగా విమర్శించటం కాస్త ఇబ్బందికర పరిస్ధితి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలకు నేతృత్వం వహించి.. తెలంగాణ సాధన తర్వాత ఎమ్మెల్యేగా మారిన శ్రీనివాస్ గౌడ్ తన మనసులోని అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. తమ సర్కారు తీరు మీద విమర్శలు చేసిన ఆయన.. స్వల్ప వ్యవధిలోనే మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సభలో మాట్లాడిన ఆయన.. తన మనసులోని వేదనను బయటపెట్టారు. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని చేపట్టినట్లు చెప్పిన శ్రీనివాస్ గౌడ్.. పరిస్థితుల్లో మార్పు రాలేదని వాపోయారు.

ఎమ్మెల్యేగా తాను.. శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న స్వామిగౌడ్ లు సంతృప్తిగా లేమని.. తమకు ఎలాంటి సంతోషం లేదన్నారు. సాధారణంగా తమ మనసులోని వేదనను చెప్పుకునే తీరుకు భిన్నంగా శ్రీనివాస్ గౌడ్.. స్వామి గౌడ్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడి సభికుల్ని విస్మయపరిచారు. ఇంతకీ వారికంత బాధ కలగటానికి.. సంతోషంగా లేకపోవటానికి కారణం కూడా ఓపెన్ గా చెప్పేయటం గమనార్హం.

శ్రీనివాస్ గౌడ్ బాధకు కారణం.. ఉద్యమంలో పాల్గొన్న తమ లాంటి వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడో ఉన్నారని.. మధ్యలో వచ్చిన వారు మాత్రం పార్టీలో ముందు వరుసలో ఉంటున్నారని అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.