Begin typing your search above and press return to search.

సమైక్య రాష్ట్రంలోనే గుర్తింపు ఉండేదన్నఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   15 Aug 2015 12:03 PM GMT
సమైక్య రాష్ట్రంలోనే గుర్తింపు ఉండేదన్నఎమ్మెల్యే
X
సమైక్య రాష్ట్రానికి బద్ధ శ్రతువు.. సమైక్యాన్ని తుదికంటా నరికేసి.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు కావటంలో పోరాటం చేసిన ఉద్యమ నాయకుల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఒకరు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి..సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా కావటమే కాదు.. మంత్రి కూడా అయిపోతానని కలలు కన్న శ్రీనివాస్ రెడ్డికి.. తాజాగా సమైక్య రాష్ట్రంలోనే బాగుండేదే అన్న భావన కలగటం విశేషం.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో అధికారులు తమకు సీట్లు కేటాయించకుండా కించపర్చటంపై అక్రోశాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఇలాంటి ఘటనే సమైక్య రాష్ట్రంలో జరిగి ఉంటే.. సీమాంధ్ర దురహంకారంగా చిత్రీకరించి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు.

కానీ.. తాము సాధించుకున్న రాష్ట్రంలో ఎమ్మెల్యే లుగా.. అది అధికారపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. తమ గురించి అధికారులు పట్టించుకోకపోవటంపై శ్రీనివాస్ గౌడ్ చిర్రుబుర్రులాడుతున్నారు. సమైక్యరాష్ట్రంలో ఉద్యమ నేతలుగా ఉన్న తమకు.. ఇలాంటి వేడుకల సందర్భంగా గుర్తింపు ఇచ్చి.. మర్యాదగా చూసుకునే వారని.. అందుకు భిన్నంగా సొంత రాష్ట్రంలో కనీస గుర్తింపు కూడా దక్కలేదని ఆయన వాపోయారు.

హైదరాబాద్ లోనే కాదు.. తెలంగాణ జిల్లాల్లోనే అధికారుల పని తీరు ఇదే తీరులో ఉందని విమర్శించిన ఆయన.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ జయశంకర్.. అమరవీరుల ప్రస్తావన లేకపోవటం దారుణమని అన్నారు. ఒకప్పటి ఉద్యమ నేత.. నేటి అధికారపక్ష ఎమ్మెల్యే కి సైతం సమైక్యంలోనే బెటర్ అన్న భావన కలగటం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లిందంటారా..?