Begin typing your search above and press return to search.

సెటిలర్స్ కాదు.. అంతా మావాళ్లే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 July 2021 12:30 PM GMT
సెటిలర్స్ కాదు.. అంతా మావాళ్లే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X
కీలక స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి. అందుకు భిన్నంగా చేసే వ్యాఖ్యలకు వారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి లొల్లి నేపథ్యంలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి.. నరరూప రాక్షసుడిగా వ్యాఖ్యానించటం వివాదాస్పదంగా మారింది. ఆయన నోటి నుంచి అంత మాట వచ్చినా.. ఏపీ మంత్రులు.. వైసీపీ నేతలు ఆచితూచి అన్నట్లుగా స్పందించారే కానీ చెలరేగిపోయి వ్యాఖ్యలు చేయలేదు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు తెలుగురాష్ట్రాల మధ్య నడుస్తున్న జలవివాదం గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న ఏపీ వాసుల గురించి ఆందోళన చెంది తాను మౌనంగా ఉండాల్సి వచ్చిందన్న ఆయన మాట పెను సంచలనంగా మారటంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. అప్పటి వరకు శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల్ని సమర్థించిన వారు సైతం.. ఆయన్ను నిందించటం షురూ చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దన్ను నిలిచిన సీమాంధ్రుల్ని తాజా వ్యాఖ్యలతో దూరం చేసుకుంటున్నారన్న వాదన వినిపించింది. వైఎస్ ను నరరూప రాక్షసుడన్న మాట దగ్గర నుంచి శ్రీనివాస్ గౌడ్ లో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఆయనేమన్నారంటే.. ''జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వారు సెటిలర్స్ కావొచ్చేమో.. ఇప్పుడు కాదు. వారంతా తెలంగాణకు చెందిన వారే. ఉద్యమ సమయంలో కూడా సెటిలర్స్ అనే పదాన్ని మేం వాడలేదు. వారు ఇప్పటికి సెటిలర్స్ అని మీరు ముద్ర వేస్తున్నారు. వారిలో చాలామంది పిల్లలు ఇక్కడే పుట్టారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలి కదా అని అనేక మందిని అడిగాం. వారంతా సానుకూలంగా స్పందించారు. వారు ఎప్పటికి మా వారే'' అని మంత్రి వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఉమ్మడి పాలకులు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.. ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తప్పులు చేయనప్పుడు.. తటస్థంగా ఉండే కేంద్రం చేతిలో పెట్టటానికి అభ్యంతరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ నోటి నుంచి వచ్చిన తొందరపాటు మాటను కవర్ చేసేందుకు పడుతున్న ప్రయాస ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి.