Begin typing your search above and press return to search.

ఈ వేద‌న‌... అమెరికాలోని తెలుగోళ్లందరిదీ!

By:  Tupaki Desk   |   25 Feb 2017 6:17 AM GMT
ఈ వేద‌న‌... అమెరికాలోని తెలుగోళ్లందరిదీ!
X
అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్క‌డి జాత్యహంకారి చేతిలోని తుపాకీ తూటాల‌కు బ‌లైపోయిన తెలుగు యువ‌కుడు శ్రీనివాస్ కూచిభొట్ల ఉదంతం ప్ర‌తి తెలుగు హృద‌యాన్ని క‌దిలించేస్తోంది. బుధ‌వారం రాత్రి జ‌రిగిన ఈ ఉదంతంపై ఇప్ప‌టికే అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌వాస భార‌తీయులు క్ష‌ణ‌క్ష‌ణం భ‌యం భ‌యంగా బ‌తుకు వెళ్ల‌దీస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ అభ‌యమిచ్చే సందేశం ఇచ్చినా కూడా అక్క‌డి వారి ఆందోళ‌న త‌గ్గ‌లేదు. ఘ‌ట‌న త‌ర్వాత శ్రీనివాస్ స‌తీమ‌ణి సున‌య‌న దుమాలా తొలిసారిగా మీడియా ముందుకు వ‌చ్చారు. శ్రీనివాస్ ప‌నిచేస్తున్న గార్మిన్ కంపెనీ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఆమె అస‌లు అమెరికా ఎంత మేర‌కు క్షేమ‌క‌ర‌మైన దేశ‌మంటూ ప్ర‌శ్నించారు.

ఇటీవ‌ల అక్క‌డ వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను తాను ముందుగానే గ్ర‌హించానని, ప‌రిస్థితుల్లో వ‌స్తున్న మార్పుల‌పై త‌న భ‌ర్త‌ను అప్ర‌మ‌త్తం చేశాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. అస‌లు మ‌నం ఇక్క‌డి ప్రాంతానికి చెందిన వార‌మేనా అని కూడా త‌న భ‌ర్త‌ను ప్ర‌శ్నించాన‌ని ఆమె చెప్పారు. అమెరికాలో క్ర‌మంగా బ‌ల‌ప‌డుతున్న జాతి వ్య‌తిరేక వాతావ‌ర‌ణంలో కూడా మ‌నం ఇంకా ఇక్క‌డే ఉండాలా? అని కూడా ప్ర‌శ్నించాన‌ని తెలిపారు. అయితే అమెరికాలో త్వ‌ర‌లోనే శుభ ప‌రిణామాలు క‌నిపించ‌నున్నాయ‌ని త‌న భ‌ర్త చెప్పాడ‌ని సున‌య‌న చెప్పారు. భ‌ర్త మాట‌ను, భ‌విష్య‌త్తుపై ఆశావ‌హ దృక్ప‌థాన్ని తాను కాద‌న‌లేక‌పోయాన‌ని కూడా ఆమె తీవ్ర ఆవేద‌నా భ‌రిత స్వ‌రంతో తెలిపారు.

ఇదిలా ఉంటే... అమెరికాకు చెందిన జాత్య‌హంకారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబానికి అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం గానీ, అక్క‌డి పోలీసులు గానీ వేగంగానే సాయ‌మందించారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే శ్రీనివాస్ ఇంటికి చేరిన భార‌త రాయ‌బార కార్యాల‌య ప్ర‌తినిధి సున‌య‌న త‌దిత‌రుల‌కు ధైర్యం చెప్పారు. అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పి ఆమెలో ధైర్యం నింపారు. ఇక ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన అలోక్ ప్ర‌మాదం నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ్డాడు. రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న అత‌డు నిన్న‌నే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు.

మ‌రోవైపు ఈ దాడి జ‌రిగిన తీరుపై భిన్న క‌థ‌నాలు వినిపిస్తున్న‌ప్ప‌టికీ... జాత్య‌హంకార ధోర‌ణితోనే అమెరిక‌న్ కాల్పులు జ‌రిపాడ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత శ్రీనివాస్‌, అలోక్‌ల‌తో వాగ్వాదానికి దిగిన ఆడ‌మ్ పురిన్ట‌న్... త‌మ దేశం విడిచిపెట్టిపోవాల‌ని వారిని బెదిరించాడు. అయినా త‌మ దేశంలో ఎందుకు ఉంటున్నార‌ని, ఇక్క‌డేం ప‌ని అని, అస‌లు మా కంటే మీలో ఉన్న గొప్ప ఏమిట‌ని కూడా పురిన్ట‌న్ వారితో వాదులాట‌కు దిగాడు. ఈ క్ర‌మంలో వాగ్వాదం తారాస్థాయికి చేర‌గా... అక్క‌డి నుంచి వేగంగా వెళ్లిపోయిన పురిన్ట‌న్ కాసేప‌టికే చేతిలో తుపాకితో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. వ‌చ్చీ రాగానే శ్రీనివాస్‌, అలోక్‌ల‌పై కాల్పుల‌కు దిగారు. మొత్తం 9 రౌండ్ల మేర పురిన్ట‌న్ కాల్పులు జ‌రిపాడు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు కేవ‌లం ఐదు గంట‌ల్లోనే పురిన్ట‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న నిజంగానే జాతి వివ‌క్ష నేప‌థ్యంలో జ‌రిగిందా? లేదా? అన్న విష‌యాన్ని తేల్చేందుకు తాజాగా ఎఫ్‌ బీఐ కూడా రంగంలోకి దిగింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/