Begin typing your search above and press return to search.

అంద‌ర్ని ఒప్పించే సారునే స్టాలిన్ క‌న్వీన్స్ చేశారా?

By:  Tupaki Desk   |   14 May 2019 6:07 AM GMT
అంద‌ర్ని ఒప్పించే సారునే స్టాలిన్ క‌న్వీన్స్ చేశారా?
X
ఈ ప్ర‌పంచంలో ఒక‌రికి మించిన మొన‌గాళ్లు మ‌రొక‌రు ఉంటారు. నాకు మించినోళ్లు మ‌రొక‌రు ఉండ‌ర‌న్నది ఆత్మ‌విశ్వాసం కంటే అత్యాశే అవుతుంది. ఒక‌రికి మించిన మొన‌గాళ్ల‌ను మ‌రొక‌రిని త‌యారు చేసే గొప్ప‌త‌నం ప్ర‌కృతిదే. కాకుంటే.. కొంద‌రి గొప్ప‌త‌నం కొన్నిసార్లు హైలెట్ అవుతూ ఉంటుంది. అంత మాత్రాన మిగిలిన వారిలో ఉన్న ప్ర‌తిభ మ‌స‌క‌బార‌దు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు అంద‌రికి అవ‌కాశం వ‌స్తుంది.

కోట్లాది మంది తెలుగు వారిని త‌న మాట‌ల‌తో ప్ర‌భావితం చేసే కేసీఆర్ లాంటి అధినేత మీద ఎన్ని అంచ‌నాలో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి ఆయ‌న‌.. త‌న‌కున్న ఇమేజ్ ను మ‌రింతగా పెంచుకునే త‌ప‌న‌లో త‌ప్పు చేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

త‌న మాట‌ల‌తో ఎలాంటి వారినైనా క‌న్వీన్స్ చేసే స‌త్తా ఉన్న అధినేత‌గా కేసీఆర్ కు పేరుంది. అలాంటి కేసీఆర్‌.. ఊహించ‌ని రీతిలో డీఎంకే అధినేత స్టాలిన్ చ‌తుర‌త ముందు త‌గ్గాల్సి వ‌చ్చిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ద‌క్షిణాదిలోని బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీల‌న్నీ ఏకం కావ‌టం ద్వారా.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా పావులు క‌ద‌ప‌టం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌కు వెళ్లిన కేసీఆర్ కు త‌మిళ‌నాడులో స్టాలిన్ మీటింగ్ స‌రికొత్త అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని చెప్పాలి.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న కేసీఆర్ ను.. తాను గ‌తంలోనే కాంగ్రెస్ కు మాట ఇచ్చాన‌ని.. రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిని చేస్తాన‌ని ఇప్ప‌టికే రెండుసార్లు చెప్పిన నేప‌థ్యంలో.. త‌న మాటను తాను వెన‌క్కి తీసుకోన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గంట పాటు స‌మావేశంలో స్టాలిన్ ను క‌న్వీన్స్ చేయ‌టంలో కేసీఆర్ విఫ‌ల‌మైన‌ట్లుగా స‌మాచారం. అన్నింటికి మించిన ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. అందరిని త‌న మాట‌ల‌తో క‌న్వీన్స్ చేసే కేసీఆర్‌.. చివ‌ర‌కు స్టాలిన్ మాట‌ల‌కు క‌న్వీన్స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

స్టాలిన్ మైండ్ సెట్ మార్చాల‌ని.. ఆయ‌న్ను త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకోవాల‌ని భావించిన కేసీఆర్ నే మార్చేసిన ఆయ‌న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కంటే కూడా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ స‌ర్కారుకు మీరే మ‌ద్ద‌తు ఇవ్వొచ్చుగా? అంటూ స్టాలిన్ చెప్పిన మాట‌ల‌కు కేసీఆర్ నోటి వెంట స‌మాధానం లేద‌న్న మాట వినిపిస్తోంది. చేతిలో ప‌వ‌ర్ లో లేకున్నా.. ప‌వ‌రున్న ప‌క్క రాష్ట్ర సీఎం వ‌చ్చి అడిగినా వెన‌క్కి త‌గ్గ‌ని స్టాలిన్.. త‌న‌కున్న ప‌వ‌ర్ ఎలాంటిదో తాజా మీటింగ్ తో స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.