Begin typing your search above and press return to search.

స్టాలిన్ మళ్లీ నచ్చాడు.. వరదల్లో జరుగుతున్న సామాన్యుల పెళ్లికి హాజరు

By:  Tupaki Desk   |   9 Nov 2021 4:30 PM GMT
స్టాలిన్ మళ్లీ నచ్చాడు.. వరదల్లో జరుగుతున్న సామాన్యుల పెళ్లికి హాజరు
X
మన దగ్గర స్థానికంగా ఏదైనా వివాహం జరిగితే అందుకు లోకల్ లో ఉండే ఎవరో ఒకరు ప్రజాప్రతినిధి హాజరు కావడం అనేది సహజం. పెళ్లి వాళ్లు మరికొంత డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లు అయితే అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ హాజరవుతారు. జరిగే పెళ్లి వేడుక ఓ మోస్తరు రాజకీయ నాయకుడు కుమారుడుదో, కుమార్తెదో అయితే మహా అంటే ఆ జిల్లాలోని మంత్రి హాజరు అవుతారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి... అత్యంత సామాన్యుడిలా ఆ పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు... నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అంటూ ఆశీస్సులు ఇచ్చారు.

సుమారు అరగంట పాటు ఆ వివాహ వేదిక వద్దనే ఉండి ఆ పెళ్లికి వచ్చిన వారితో కలిసి ముచ్చటించారు. కొత్త జంటతో కలిసి భోజన చేశారు. వారు చెప్పిన విషయాలను తదేకంగా విన్నారు. ఇది అంతా చూసిన పెళ్లి వారు ఆశ్యర్యంతో ముక్కు వేలువేసుకున్నారు. ఈ తంతు అంతా సాగింది సాధారణ రోజుల్లో అని అనుకుంటే పొరపాటే. కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో విధినిర్వహణలో బాగా వచ్చారు ఆ సీఎం. ఆయనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన మార్కు పాలనకు తెర తీశారు. ప్రతీ విషయాన్ని సొంతం చేసుకొని ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. నేను మీ మనిషిని, ప్రజల వాడిని అని గుర్తు చేస్తుంటారు. వాటిని నిజం చేసే రీతిలో చాలా సార్లు స్టాలిన్ తన పెద్ద మనుసును చాటుకున్నారు. ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

నగరమంతా వరదమయం. ఈ సమయంలో ప్రజలకు సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్.. చైన్నైలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో సమీక్షించారు. సహయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అనే తెలుసుకోవడానికి నడుం కట్టి.. జోరు వానలో నగరంలో పర్యటించారు.

ఈ నేపథ్యంలోనే కవియారాసు కన్నడసాన్ నగర్ అనే ప్రాంతంలో జరుగుతున్న గౌరీ శంకర్, మహాలక్ష్మీ అనే నూతన వధూవరుల పెళ్లికి హాజరయ్యారు. ఇందుకోసం తన కాన్వాయిని ఆపి.. స్వయంగా తానే నడుచుకుంటూ వచ్చి వారికి ఆశీస్సులు తెలిపారు. అనుకోకండా వచ్చిన ఈ అతిథిని చూసిన పెళ్లివారు ఒక్కసారిగా షాక్కుకు గురయ్యారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలా చేయడం ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా రోడ్డు మీద పోతూ ఇలానే ఓ పెళ్లికి హాజరయ్యారు. అంతేగాకుండా ఇటీవల ఓ అంబులెన్స్ కు తన కాన్వాయి అడ్డుగా ఉంటే అది గమనించిన స్టాలిన్ అంబులెన్సుకు దారి ఇచ్చారు. సిటీ బస్సుల్లో సడన్ గా ప్రత్యక్షమై... మహిళల బాధలు అడిగి తెలుసుకున్నారు. ఓ వృద్ధురాలు రోడ్డుపై వేచి ఉంటే ఆమె దగ్గరకు వచ్చిన స్టాలిన్ నిమిషాల వ్యవధిలోనే ఆమె కోరిన పని చేసేలా అధికారులను ఆదేశించారు. ఇలా తనమార్కు పాలనతో ప్రజలకు చేరువుగా ఉంటూ.. ప్రజల ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుంటున్నారు.