Begin typing your search above and press return to search.

రాష్ట్రపతికి స్టాలిన్ కీలక లేఖ.. ఏం కోరారంటే?

By:  Tupaki Desk   |   21 May 2021 4:32 AM GMT
రాష్ట్రపతికి స్టాలిన్ కీలక లేఖ.. ఏం కోరారంటే?
X
సంచలన నిర్ణయాలు.. ఆసక్తికర అడుగులతో ముందుకెళుతున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా మరో అంశాల్ని టచ్ చేశారు. తమిళులు అంతా కోరుకుంటున్నారంటూ రాష్ట్రపతి కోవింద్ కు రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన తెర మీదకు తెచ్చిన అంశం.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులోని దోషులందరిని జైలు నుంచి విడుదల చేయాలని కోరారు.

మూడు దశాబ్దాలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నందున వారిని ముందుగానే విడుదల చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజాభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఇదే అంశాన్ని 2018లో నాటి తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ ను ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్ దాడితో మరణించిన వైనం తెలిసిందే. ఈ కేసులో వి. శ్రీహరన్ అలియాస్ మురగన్.. అతడి భార్యనళిని.. శాంతన్.. పెరియవాలన్.. జయకుమార్.. రాబర్ట్ పయాస్.. రవిచంద్రన్ ను దోషులుగా తేల్చి శిక్ష విధించారు. వారికి విధించిన శిక్షను తగ్గించి విడుదల చేయాలని 2018లో డీఎంకే డిమాండ్ చేసింది.

ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ తన పాత డిమాండ్ ను మరోసారి తెర మీదకు తీసుకురావటమే కాదు.. రాష్ట్రపతికి లేఖ రాశారు. స్టాలిన్ అధ్యక్షుడిగా ఉన్న డీఎంకేకు.. కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. మరీ.. లేఖ ముందు మిత్రపక్షంతో దీని గురించి మాట్లాడారా? అన్న దానిపై మాత్రం స్పష్టత రావట్లేదు.