Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద తొక్కిస‌లాట‌.. ఎంత‌వ‌ర‌కు నిజం?

By:  Tupaki Desk   |   1 July 2019 8:36 AM GMT
జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద తొక్కిస‌లాట‌.. ఎంత‌వ‌ర‌కు నిజం?
X
అమ‌రావ‌తిలోని తాడేప‌ల్లిలోని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టులు వ‌స్తున్నాయి. అయితే.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది చూస్తే.. ఈ రోజు (సోమ‌వారం) నుంచి జ‌గ‌న్ నివాసం వ‌ద్ద ఉద‌య‌మే ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని ఇట్టే ప‌రిష్క‌రిస్తూ.. పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న జ‌గ‌న్ మీద కొండంత ఆశ‌తో ఈ రోజు ఉద‌య‌మే జ‌గ‌న్ నివాసం వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అర్జీలు ప‌ట్టుకొని వ‌చ్చారు. ఇదిలా ఉంటే.. ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేలా ఏర్పాట్లు ఇంకా పూర్తి కాక‌పోవ‌టంతో.. ఆ కార్య‌క్ర‌మాన్ని ఆగ‌స్టు 1 నాటికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. ప్ర‌జాద‌ర్బార్ వాయిదా ప‌డిన వైనాన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా రాలేదు. దీంతో ప్ర‌జాద‌ర్బార్ లో త‌మ స‌మ‌స్య‌ల్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాల‌న్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు సీఎం నివాసం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అయితే..కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింద‌ని.. ఆగ‌స్టు ఒక‌టి నుంచి షురూ చేస్తార‌ని.. దీనికి సంబంధించిన స‌మాచారం మీడియాలో వ‌స్తుంద‌ని చెప్పినా.. అక్క‌డి నుంచి ప్ర‌జ‌లు క‌ద‌ల‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే సీఎంను క‌ల‌వాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా తోసుకురావ‌టంతో చిన్న‌పాటి తొక్కిస‌లాట చోటు చేసుకుంది. అయితే.. త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు వెంట‌నే రియాక్ట్ అయ్యారు. జ‌నాల్ని కంట్రోల్ చేశారు. ఈ సంద‌ర్భంగా అనంత‌పురం జిల్లాకు చెందిన విశ్రాంత‌మ్మ అనే మ‌హిళ స్పృహ త‌ప్పి కింద ప‌డిపోయారు. ఆమెకు ప్ర‌థ‌మ చికిత్స చేప‌ట్టారు. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్దేశించి ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్ర‌మాన్ని ఆగ‌స్టు 1 నుంచి షురూ చేయ‌నున్నారు.