Begin typing your search above and press return to search.

క్రెడిట్ కోసం ఆరాటం మొదలైందా ?

By:  Tupaki Desk   |   27 May 2021 7:30 AM GMT
క్రెడిట్ కోసం ఆరాటం మొదలైందా ?
X
కృష్ణపట్నం ఆనందయ్య చుక్కల మందుతో కరోనా వైరస్ తగ్గుతోందో లేదో తెలీదు కానీ ఆ పేరుతో క్రెడిట్ పోరాటం మాత్రం మొదలైంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో గడచిన రెండు నెలలుగా ఆనందయ్య కరోనా వైరస్ కు విరుగుడుగా చుక్కల మందు ఇస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఆ విషయం సోషల్ మీడియాలో బయటపడటంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దానికితోడు మందు తీసుకున్న వారు తమకు చాలా తొందరగానే కరోనా సమస్య నుండి బయటపడ్డామని చెప్పటంతో సంచలనం మొదలైంది.

సరే ఈ విషయం అటుపోయి ఇటుపోయి చివరకు లోకాయుక్తలో ఎవరో ఫిర్యాదు చేయటం, కలెక్టర్ మందు పంపిణీపై బ్యాన్ పెట్టారు. అప్పటి నుండి ప్రతిరోజు జరుగుతున్న డెవలప్మెంట్లు అందరికీ తెలిసిందే. ఈ మందు పంపిణీ విషయం సంగతిని పక్కన పెట్టేస్తే ఆనందయ్యను అడ్డం పెట్టుకుని క్రెడిట్ కోసం ఆరాటం మొదలైపోయింది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం వెళ్ళి ఆనందయ్య కుటుంబాన్ని కలిశారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు ఆనందయ్య చుక్కల మందును అడ్డంపెట్టుకుని ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి క్రెడిట్ కొట్టేసేందుకు తెగ ఆరాటపడుతున్నట్లు ఆరోపించారు. వేలాది జనాలకు మేలుచేసే ఆనందయ్య చుక్కల మందుపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. చుక్కల మందు అందరికీ పంపిణీ జరిగేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటం వరకు ఓకేనే. కానీ మధ్యలో కాకాణి గోవర్ధనరెడ్డి ప్రస్తావన ఎందుకు ?

అధికారపార్టీ ఎంఎల్ఏగా తన నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్మెంట్ కాబట్టి తాను క్రెడిట్ తీసుకోవాలని కాకాణి ప్రయత్నించుండచ్చు. ఇందులో ఎంఎల్ఏని తప్పుపట్టాల్సిందేమీలేదు. పదిమంది ఎక్కడుంటే వాళ్ళ దృష్టిని ఆకర్షించాలని అనుకోవటం రాజకీయ నేతలకు సహజం. ఆమాట కొస్తే అసలు సోమిరెడ్డి కృష్ణపట్నం ఎందుకు వచ్చినట్లు ? ఆనందయ్య కుటుంబాన్ని కలిసి ఎందుకు సన్మానం చేసినట్లు ? ప్రచారం కోసమే కదా. ఒకవైపు తాను ప్రచారం కోసం తాపత్రయపడుతునే మళ్ళీ ఇదే విషయమై ఎంఎల్ఏపై ఆరోపణలు చేయటమేంటో ?