Begin typing your search above and press return to search.

ఉక్కుకు మద్దతుగా రాష్ట్రం అఫిడవిట్

By:  Tupaki Desk   |   22 Aug 2021 5:37 AM GMT
ఉక్కుకు మద్దతుగా  రాష్ట్రం అఫిడవిట్
X
నరేంద్రమోడి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్న నరేంద్రమోడి సర్కార్ నిర్ణయానికి రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు తన అఫిడవిట్ దాఖలు చేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించటం కాదని ముందు సొంతానికి ఇనుపఖనిజం గనులను కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది.

ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరించే విషయంలో చాలా స్పీడుగా ముందుకెళుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రైవేటీకరణ వద్దని చెప్పిన జగన్మహన్ రెడ్డి గతంలోనే కేంద్రానికి ఓ లేఖరాశారు. తన లేఖలో ఉక్కు ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించటానికి కొన్ని మార్గాలను ప్రతిపాదించారు. అందులో ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా గనులు కేటాయించటం కీలకమైంది. అలాగే అప్పులను ఈక్విటీగా మార్చటం రెండోది. మూడో మార్గమేమిటంటే ప్రైవేటీకరించేబదులు మొత్తం ఫ్యాక్టరీని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని.

దేశం మొత్తంమీద ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్ధల్లో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీల్లో అత్యుత్తమ పనితీరును చూపుతున్నది విశాఖ ఉక్కు మాత్రమే. రికార్డు స్ధాయిలో ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. కరోనా వైరస్ సమస్యతో చాలా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిపోయింది. అయితే విశాఖ ఉక్కు మాత్రం ఇటు రోగులకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తిచేస్తునే మరోవైపు రికార్డుస్ధాయిలో ఉక్కునూ ఉత్పత్తి చేసిన విషయం స్వయంగా కేంద్రమే ప్రకటించింది.

ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఫ్యాక్టరీ నష్టాల్లోకి పోవటానికి ప్రత్యేకంగా సొంతంగా ఇనుపఖనిజం గనులు లేకపోవటమే అని అందరికీ తెలిసిందే. ఫ్యాక్టరీకి సొంతంగా గనులు కేటాయించమని ఎన్నిసార్లు లేఖలు రాస్తున్న కేంద్రం పట్టించుకోవటంలేదు. పక్కనే ఉన్న ఒడిస్సాలోనో లేకపోతే ఝార్ఖండ్ లో ఉన్న గనులు కేటాయించకుండా ఎక్కడో రాజస్ధాన్లో ఉన్న నాసిరకం గనులను కేటాయించింది. దాంతో వాటిని తీసుకోవటం వల్ల ఎదురయ్యే సమస్యలను చెప్పినా కేంద్రం పట్టంచుకోవటంలేదు.

విచిత్రమేమిటంటే ప్రైవేటు సంస్ధలకు అడిగిన వెంటనే, అడిగిన ప్రాంతాల్లో ఇనుపఖనిజాలను కేటాయిస్తున్న కేంద్రం విశాఖ ఫ్యాక్టరీకి మాత్రం కేటాయించటంలేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే వైజాగ్ స్టీల్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టేసి ప్రైవేటకీరించాలనే ప్లానుతోనే కేంద్రం ముందుకెళుతోందని అర్ధమైపోతోంది. అందుకనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టులో కేసు వేశారు. తాజాగా రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.