Begin typing your search above and press return to search.

జ‌నాల చ‌మురు తీస్తున్న ప్ర‌భుత్వాలు!

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:34 AM GMT
జ‌నాల చ‌మురు తీస్తున్న ప్ర‌భుత్వాలు!
X
పేద‌ల‌కు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం. పండ‌క్కి చీర‌లిస్తాం.. పిండివంట‌ల కోసం స‌రుకులు ఫ్రీగా ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే త‌ర‌చూ ఏదో ఒక తాయిలం ప్ర‌క‌టించే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. అంద‌రికి ఉప‌శ‌మ‌నం క‌లిగించే నిర్ణ‌యం తీసుకోవ‌టానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ నిత్యం ప్ర‌తిఒక్క‌రు ఉప‌యోగించే పెట్రోల్‌.. డీజిల్ మీద భారీ భారాన్ని మోపుతున్న వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

పెట్రోల‌.. డీజిల్ ప‌న్ను విధానంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వైఖ‌రి ప్ర‌జ‌లు జేబుల మీద భారీ భారాన్ని మోపేలా మారింది. గ‌తంలో స‌బ్సిడీ మీద పెట్రోల్‌.. డీజిల్ అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు వేలాది కోట్లు సంపాదించే మార్గాలుగా మార్చుకున్న ప్ర‌భుత్వాల వైఖ‌రితో స‌గ‌టు జీవి తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.

నిత్య‌వ‌స‌ర వ‌స్తువులాంటి పెట్రోల్‌.. డీజిల్ మీద కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిపి వ‌సూలు చేస్తున్న ప‌న్ను ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే.

పెట్రోల్ మీద 57 శాతం ప‌న్నుల్ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు బాదేస్తుంటే.. డీజిల్ మీద 44 శాతం మేర ప‌న్నుభారాన్ని వ‌డ్డిస్తున్నారు. దీనికి తోడు అంత‌ర్జాతీయంగా నిత్యం మారే ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్లు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించేలా తీసుకున్న నిర్ణ‌యంతో వినియోగ‌దారుడి మీద ప‌డే భారం పైస‌ల్లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నా.. అంతిమంగా నొప్పి తెలీకుండా భారం ప‌డుతున్న ప‌రిస్థితి. ఎక్క‌డిదాకానో ఎందుకు గ‌త ఏడాది జులైలో పెట్రోల్ లీట‌రు రూ.67.11 ఉండ‌గా ఇప్పుడు రేటు ఎంతో తెలుసా? అక్ష‌రాల లీట‌రు రూ.75.47. అంటే ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో పెరిగిన ధ‌రను పైస‌ల్ని తీస్తేస్తే లీట‌రుకు ఎనిమిది రూపాయిలు. ఇంత ధ‌ర పెరిగినా.. ఎందుకు భారం అనిపించ‌ట్లేదంటే.. రోజుకో ఐదు పైస‌లు.. ప‌ది పైస‌లు చొప్పున పెంచేస్తూ.. ధ‌ర పెరిగింద‌న్న విష‌యాన్ని తెలీకుండా పెంచేస్తున్న ప్ర‌భుత్వ వైఖ‌రితో అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌టంతో భారీగా ధ‌ర‌లు పెంచిన‌ట్లు చెప్పిన‌ప్పుడు.. ఎంత భారీగా పెరిగాయో అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కానీ.. లెక్క‌ల్లోకి వెళితే.. ఈ మాత్రానికే ఇంత భారీగా ధ‌ర‌లు పెంచాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. 2013 సెప్టెంబ‌రులో అంటే.. యూపీఏ 2 ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న వేళ అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర బ్యారెల్ 113 డాల‌ర్లు. మ‌న రూపాయిల్లో చూస్తే. రూ.7200. అప్పుడు హైద‌రాబాద్ లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.83.07 కాగా.. డీజిల్ రూ.58.67. క‌ట్ చేస్తే.. దాదాపు రెండున్న‌రేళ్ల త‌ర్వాత సంగ‌తి చూస్తే.. అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడిచ‌మురు బ్యారెల్ ధ‌ర 32 డాల‌ర్లు మాత్ర‌మే. మ‌న రూపాయిల్లో చూస్తే 2048 మాత్ర‌మే. కానీ.. హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఎంతో తెలుసా? రూ.60.63.. డీజిల్ ధ‌ర రూ.54.40. 2013లో అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు బ్యారెల్ ధ‌ర‌లో 30 శాతం కంటే త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ ధ‌ర‌లు మాత్రం ఆ మేర‌కు త‌గ్గ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ‌ర్తమానానికి వ‌స్తే.. ఈ భారం మ‌రింత ఆగ్ర‌హం తెప్పించ‌క మాన‌దు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 89 డాల‌ర్లు. అంటే.. మ‌న రూపాయిల్లో 4,416. మ‌రి హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఎంతో తెలుసా? రూ.75.47.

అంటే.. 2013 సెప్టెంబ‌రులో అంత‌ర్జాతీయంగా బ్యారెల్ ధ‌ర (113 డాల‌ర్లు)లో 50 శాతానికి కాస్త ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి.. అప్ప‌టి పెట్రోల్‌.. డీజిల్ లీట‌రు (రూ.83.07, రూ.58.67)తో పోలిస్తే.. ఇప్పుడు వ‌సూలు చేస్తున్న‌ది (రూ.75.47, 67.23) భారీగా ఉండ‌టం క‌నిపిస్తుంది. మ‌రింత క్లియ‌ర్ గా చెప్పాలంటే.. 2013 సెప్టెంబ‌రులో అంత‌ర్జాతీయంగా బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర కంటే ఇప్పుడు 44 డాల‌ర్లు త‌క్కువ‌గా ఉంది. కానీ.. లీట‌రు పెట్రోల్ విష‌యంలో ఉన్న వ్య‌త్యాసం ఏడున్న‌ర రూపాయిలు మాత్ర‌మే. అంటే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయ‌ని చెబుతున్నా.. గ‌తంలో పోలిస్తే వ్య‌త్యాసం చాలా ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ ధ‌ర‌లు త‌గ్గించే విష‌యంలో.. ప్ర‌జ‌లు మీద భారం ప‌డ‌కుండా చూసే విష‌యంలో అటు మోడీ స‌ర్కారు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల‌కు కానీ మ‌నసు ఒప్ప‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆఖ‌రుగా మ‌రో విష‌యాన్ని చెప్పాలి. సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో త‌మ కంటే మొన‌గాడు లేడ‌న్న‌ట్లుగా చెప్పుకునే ఇద్ద‌రు చంద్రుళ్లు.. పెట్రోల్‌ విష‌యంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. మ‌హారాష్ట్ర త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్య‌ధికంగా ప‌న్ను వ‌సూళ్లు చేస్తున్నారు. ఇక‌.. డీజిల్ విష‌యంలో దేశంలో ఏపీనే టాప్‌. త‌ర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది.

అడ‌గ‌కున్నా అదే ప‌నిగా వ‌రాలు అందించే చంద్రుళ్లు.. నిత్యం ప్ర‌తిఒక్క‌రు వినియోగించే పెట్రోల్ డీజిల్ మీద భారీ ఎత్తున పన్నులు ఎందుకు వ‌సూలు చేస్తున్నారో అస్స‌లు చెప్పరు. మ‌హారాష్ట్రలో పెట్రోల్ మీద 43.71 శాతం రాష్ట్ర స‌ర్కారు ప‌న్ను బాదితే.. త‌ర్వాతి స్థానాల్లో ఏపీ 38.82 శాతం.. తెలంగాణ 35.20 శాతంగా నిలుస్తుంది. పెట్రోల్ మీద దేశంలో అతి త‌క్కువ‌గా ప‌న్ను విధించే రాష్ట్రంగా గోవాను చెప్పొచ్చు. ఆ రాష్ట్రంలో కేవ‌లం 17 శాతం ప‌న్ను మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నారు.

డీజిల్ విష‌యానికి వ‌స్తే.. దేశంలో ఏపీనే అత్య‌ధిక మొత్తంలో ప‌న్ను వ‌సూలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 30.71 శాతం డీజిల్ మీద ప‌న్ను విధిస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు. త‌ర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్రం 27 శాతం వ‌సూలు చేస్తుంది. డీజిల్ లో త‌క్కువ పన్ను పోటు వేస్తున్న ఘ‌న‌త ఢిల్లీ రాష్ట్రానికే ద‌క్కుతుంది. కేవ‌లం 17.37 శాతం ప‌న్నును వ‌సూలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో వేలాది కోట్లు ఖ‌ర్చు పెట్ట‌టం స‌బ‌బా? కోట్లాది మంది నిత్యం వినియోగించే పెట్రోల్‌.. డీజిల్ మీద ప‌న్నుపోటు త‌గ్గించ‌టం మంచిదా?