Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌కు మోడీ తీరును ఎండ‌గ‌ట్టే ఛాన్స్‌..!

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:45 AM GMT
ఆంధ్రోళ్ల‌కు మోడీ తీరును ఎండ‌గ‌ట్టే ఛాన్స్‌..!
X
ఇప్పుడు కాకుంటే మరెప్ప‌టికీ కాదన్న‌ట్లుగా ఒక అవ‌కాశం ఆంధ్రోళ్ల‌కు వ‌చ్చింది. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ర‌గిలిపోతున్న ఏపీ ప్ర‌జ‌లు త‌మ మ‌న‌సులోని బాధ‌ను చెప్పే అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చింది. ఇప్ప‌టికే బ‌డ్జెట్ కేటాయింపుల‌పై ఏపీ స‌ర్కారుతో పాటు విప‌క్షం సైతం పార్ల‌మెంటులో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

ఏపీ రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై ప్ర‌ధాని మోడీ రియాక్ట్ కావాల్సి వ‌చ్చింది.త‌మ‌పై ఆంధ్రోళ్ల‌లో అంత‌కంత‌కూ పెరుగుతున్న ఆగ్ర‌హానికి పుల్ స్టాప్ పెట్టేందుకు మోడీ త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని రంగ‌రించి.. భావోద్వేగంగా ప్ర‌సంగించి.. కాంగ్రెస్‌ పై కోపాన్ని బ‌దిలీ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం మీద అదే ప‌నిగా అక్రోశాన్ని వ్య‌క్తం చేసిన మోడీ.. నాలుగేళ్లుగా తానెందుకు ఏమీ చేయ‌లేక‌పోయాన‌న్న విష‌యాన్ని మాత్రం మాట వ‌ర‌స‌కు ప్ర‌స్తావించ‌లేదు. ఇదంతా చూసిన‌ప్పుడు అర్థ‌మ‌య్యేదేమంటే.. భావోద్వేగ భుజాల మీద తుపాకీ పెట్టేసి కాంగ్రెస్ ను మ‌రోసారి కాల్చేద్దామ‌న్న వ్యూహం క‌నిపిస్తుంది.

మోడీ ప్ర‌సంగం విన్న త‌ర్వాత ఆంధ్రోళ్ల‌కు మ‌రింత మంట పుట్టింది. ద‌ద్ద‌మ్మ‌ల్లా క‌నిపిస్తున్నామా? అన్న భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ వ్య‌క్త‌మైంది. ముగిసిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు క‌క్కే మోడీ.. తానెందుకు చేయ‌లేక‌పోతున్నాన‌న్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మైంది. ఇలాంటి వేళ‌.. వామ‌ప‌క్ష పార్టీలు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌తిఒక్క‌రూ ఎలుగెత్తాల్సిన వేళ‌.. ఈ బంద్ ను విజ‌య‌వంతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

పేరుకు వామ‌ప‌క్షాల బంద్ అయినా.. విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ చెప్పారు. జ‌న‌సేన సైతం బంద్‌ కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. శాంతియుతంగా బంద్ నిర్వ‌హించాలని పేర్కొంది. అధికార‌ప‌క్షం సైతం బంద్‌ ను వ్య‌తిరేకించ‌టం లేదు. స్కూళ్లు.. కాలేజీల‌కు ముంద‌స్తుగా సెల‌వు ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌లు వాయిదా వేశారు. మొత్తంగా ఏపీ మొత్తం బంద్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి వేళ‌.. ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌దైన రీతిలో మోడీకి త‌మ నిర‌స‌న సెగ త‌గిలేలా చేయాలి.

బహిరంగ ప్ర‌దేశాలతో పాటు.. ప్ర‌తి వాణిజ్య సంస్థా.. ప్ర‌తి ఇంటి మీద మోడీ తీరును నిర‌సిస్తూ న‌ల్ల‌జెండాను ఎగుర‌వేయాల్సిన అవ‌స‌రం ఉంది అంతేనా.. బీజేపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల ఇళ్ల ముందే డ‌ప్పు వాయించాలి. నిధుల కేటాయింపులో ఏపీ ప‌ట్ల ఎందుకంత నిర్ల‌క్ష్యాన్ని మోడీ స‌ర్కారు ప్ర‌ద‌ర్శించిందో చెప్పాలంటూ ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఉంది. మొత్తంగా బీజేపీ నేత‌ల ద్వారా బీజేపీ అధినాయ‌క‌త్వానికి.. ప్ర‌ధాని మోడీకి ఆంధ్రోళ్ల ఆందోళ‌న ఎలా ఉంటుందో శాంపిల్ గా తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌వేళ‌.. ఈ రోజు బంద్ విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోతే మాత్రం.. ఏపీని కేంద్రం ఎప్ప‌టికీ ప‌ట్టించుకోద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అందుకే.. ఏపీ ప్ర‌జ‌లు ఈ రోజు బంద్ ను ఎవ‌రికి వారు స్వ‌చ్చందంగా పాటించ‌ట‌మే కాదు.. ఘ‌న విజ‌యం సాధించేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. బంద్ సెగ మోడీకి చురుగ్గా త‌గిలితేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.