Begin typing your search above and press return to search.

శివ‌సేన బాట‌లో ఆర్ ఎప్పీ!..మోదీకి బ్యాండేనా!

By:  Tupaki Desk   |   30 Jan 2018 12:32 PM GMT
శివ‌సేన బాట‌లో ఆర్ ఎప్పీ!..మోదీకి బ్యాండేనా!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది. 2019 ప్ర‌థ‌మార్థంలో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారే మ‌రోమారు విజ‌యం సాధిస్తుంద‌ని ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌ర్వేల‌న్నీ తేల్చేయ‌గా... ఆ స‌ర్వేల మాట తుస్సుమ‌నే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చింది. ఎన్డీఏ అంటే బీజేపీ ఒక్క‌టే కాద‌న్న విష‌యం తెలిసిందేగా. బీజేపీ ఆ కూట‌మిలో ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉండ‌గా - టీడీపీ - శివ‌సేన తదిత‌ర చాలా పార్టీలు ఆ కూటిమిలో ఉన్నాయి. మ‌హారాష్ట్ర లాంటి కీల‌క రాష్ట్రానికి చెందిన శివ‌సేన ఎప్ప‌టిక‌ప్పుడు మోదీ స‌ర్కారును ఇబ్బంది పెడుతోంటే.. మ‌రో కీల‌క రాష్ట్రంగా ఉన్న ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కూడా మోదీకి చుక్క‌లు చూపిస్తోంద‌నే చెప్పాలి. మొత్తానికి ఎన్డీఏ గూడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి భ‌ద్రంగా ఉండే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేద‌ని ఇటీవ‌లి ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తేనే అర్థ‌మైపోతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

మొన్న‌టికి మొన్న ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగానే కాకుండా మ‌హారాష్ట్రలో బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన పార్టీగా - ఆవిర్భావం నుంచి బీజేపీతో క‌లిసి సాగుతున్న పార్టీగా శివ‌సేన‌కు పేరుంది. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు అభిప్రాయ బేధాలు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌ధాని మోదీ వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే... త‌మ దారి తాము చూసుకునే ప‌రిస్థితులు బీజేపీనే క‌ల్పిస్తోంద‌ని చాలా సార్లు ఆరోపించారు. తాజాగా అదే మాట‌ను నిజం చేస్తూ ఆయ‌న ఎన్డీఏ కూటిమి నుంచి వైదొల‌గిన‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కూడా. ఈ దెబ్బ‌తో షాక్ తిన్న బీజేపీ... ఏపీలోనూ టీడీపీతో సంబంధాలు దెబ్బ తిన్న నేప‌థ్యంలో ప‌రిస్థితి చేయి దాట‌క‌ముందే స్పందించింద‌నే చెప్పాలి. అయితే ఏపీలో ప‌రిస్థితి చేయి దాటిపోకున్నా... ఏడాదిన్న‌ర క్రితం జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి గట్టి దెబ్బ కొట్టిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వ్యూహం ఫ‌లితంగా ఇప్పుడు పెద్ద దెబ్బే ప‌డిపోయింద‌ని చెప్పాలి.

2020లో జ‌రిగే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిస్తే... బీహార్ సీఎం ప‌ద‌విని ఇస్తామ‌ని ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహకు బంప‌ర్ ఆఫర్ ప్ర‌క‌టించేశారు. ప్ర‌స్తుతం కుష్వాహ‌.. మోదీ కేబినెట్‌ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే బీహార్ అసెంబ్లీ త‌మ‌ను దెబ్బ కొట్టిన లాలూపై కక్ష‌గ‌ట్టిన మోదీ... ఆయ‌న‌పై కేసుల‌ను తిర‌గదోడార‌ని - మోదీ స‌ర్కారు ప్ర‌త్యేక దృష్టి కార‌ణంగానే లాలూ ఫ్యామిలీపై ఐటీ దాడులు - చివ‌ర‌కు లాలూకు జైలు శిక్ష ప‌డిపోయింద‌ని బీహారీలు నమ్ముతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్ర‌తిగానే చాలా స్లోగానే పావులు క‌దిపిన లాలూ... కుశ్వాహ‌ను తన వైపున‌కు తిప్పుకునేందుకు ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది. కుశ్వాహ ఎన్డీఏ కూటమి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌న్న మాట‌లో ఏ మేర‌కు వాస్త‌వ‌ముందో తెలియ‌దు గానీ.. ఈ త‌ర‌హా వార్త‌ల‌తో నిజంగా మోదీ స‌ర్కారుకు డేంజ‌ర్ బెల్స్ మొద‌లైన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.