Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుకు లిట్మస్ టెస్టుగా ఆ రాష్ట్ర ఎన్నికలు?

By:  Tupaki Desk   |   16 Jan 2022 5:59 AM GMT
మోడీ సర్కారుకు లిట్మస్ టెస్టుగా ఆ రాష్ట్ర ఎన్నికలు?
X
యూపీ ఎన్నికలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మోడీ మీద ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. దానికి లిట్మస్ పరీక్షలా యూపీ ఫలితం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. దేశంలోనే అత్యంత పెద్దదైన రాష్ట్రం ఇచ్చే తాజా తీర్పు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటంతో పాటు.. మోడీ సర్కారు మైండ్ సెట్ మీద కూడా భారీ మార్పు తీసుకొస్తుందంటున్నారు. మొదటి టర్మ్ తో పోలిస్తే.. రెండో టర్మ్ లో ప్రధాని మోడీ మరింత మొండిగా తయారు కావటం.. విపక్షాల అభ్యంతరాల్ని పట్టించుకోకుండా.. మొండిగా నిర్ణయాలు తీసుకోవటం.. దానికి తగ్గట్లు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవటం.. చివరకు వెనక్కి తగ్గని పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఇలాంటి వేళలో వచ్చిన యూపీ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. యోగిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం తెలిసిందే. యోగి నుంచి ఆశించిన దానికి ఏ మాత్రం పొంతన లేని రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. యోగికి షాకిచ్చేందుకు యూపీ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తుంటే.. కమలనాథులు వాటిని కొట్టి పారేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం విపక్షాలన్ని కలిసికట్టుగా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో రెండు.. మూడు నెలలు వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. కరోనా మూడో వేవ్ దేశాన్ని చుట్టేసిన వేళలో.. ఎన్నికలు నిర్వహించటం ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికలు కోరుకోవటంతో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తప్పలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత ముదర ముందే.. ఎన్నికల్ని పూర్తి చేయాలని కమలనాథులు కోరుకుంటే.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా చేసి.. యోగి సర్కారు మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని విపక్షాలు భావించటం విశేషం.

ఎవరికి వారు.. ఎన్నికలు ఇప్పుడే జరగాలని కోరుకుంటున్న వేళ.. పోల్ సర్వేలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. అయితే.. అవన్నీ కూడా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగమేనని విపక్షాలు మండి పడుతున్నాయి. యూపీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని దేశ ప్రజలకు తప్పుగా మీడియా సంస్థలు చూపిస్తాయని.. ఎన్నికల ఫలితాలు మీడియా పరపతిని మరింత దిగజార్చటం ఖాయమని విపక్ష నేతలు చెబుతున్నారు. యూపీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారాయి. విపక్షాలు ఆరోపించినట్లుగా తమ పరపతి ఏ మాత్రం తగ్గలేదని.. తాము వినిపించే హిందుత్వ నినాదానికి ఓట్లు రాలతాయన్న విషయాన్ని తాజా ఫలితంతో స్పష్టం చేయాలని భావిస్తున్నారు.

మరో రెండేళ్ల వ్యవధిలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించటం ద్వారా..అరుదైన హ్యాట్రిక్ ను సొంతం చేసుకోవాలని మోడీ అండ్ కో ఆరాటపడుతోంది. యూపీ ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. బీజేపీలో ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని.. విపక్షాలు మరింత బలోపేతం కావటంతో పాటు.. బీజేపీ వ్యతిరేక కూటమికి అవకాశాలు ఉన్నాయన్న విషయం స్పష్టం కావటం ఖాయం. అదే జరిగితే.. 2024 ఎన్నికలు మోడీ పరివార్ అనుకున్న దానికి భిన్నమైన వాతావరణంలో జరగటం ఖాయం. అందుకే..తమచేతిలో ఉన్న పగ్గాలు చేజారిపోకుండా ఉండాలంటే.. యూపీ ఎన్నికల్లో విజయం తప్పనిసరిగా బీజేపీ భావిస్తోంది. ఐదేళ్ల క్రితం తమకు వచ్చిన సీట్లు రాకున్నా ఫర్లేదు..విజయం మాత్రం ఖాయంగా తమ ఖాతాలోనే పడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందన్నది కాలమే జవాబివ్వాలి.