Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టు లాగానే త‌మిళ‌నాడులో మ‌రో పోరు

By:  Tupaki Desk   |   8 May 2017 7:19 AM GMT
జ‌ల్లిక‌ట్టు లాగానే త‌మిళ‌నాడులో మ‌రో పోరు
X
పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో వారి సంప్ర‌దాయ క్రీడ అయిన జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా, కేంద్ర‌ప్ర‌భుత్వం- న్యాయ‌స్థానాల తీర్పుల‌కు వ్య‌తిరేకంగా గ‌త ఏడాది జరిగిన పోరాటం గుర్తుండే ఉంటుంది. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి సైతం త‌మిళుల నిర‌స‌న‌పై స్పందించాల్సి వ‌చ్చింది. అదే స్థాయిలో మ‌రో పోరాటానికి రంగం సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఇదంతా హిందీ భాష‌ను త‌మిళ‌నాడులో ప్ర‌వేశ‌పెట్ట‌డం, నీట్ ప‌రీక్ష గురించి. ఈ కొత్త పోరాటానికి ఆజ్యం పోస్తోంది త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌.

హిందీ భాష - నీట్‌ పరీక్షలను వ్యతిరేకంగా డీఎంకే శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టాలిన్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలంటే విద్యార్థులు ముక్త కంఠంతో హిందీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. డీఎంకేకు పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించడం లేదని, తమిళనాడులో హిందీని ప్రవేశ పెట్టడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని విద్యార్థులకు వివరించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ భాష కారణంగా మాతృ భాష అయిన తమిళం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ ధ్వజమెత్తారు. అదే సమయంలో హిందీని ఇష్టపడి చవివే వారిని వ్యతిరేకించడం లేదని ఆయన గుర్తుచేశారు. తమిళాన్ని అధికార భాషగా మార్చడానికి, మద్రాసు హైకోర్టులో కేసులను తమిళంలో వాదించడానికి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు డీఎంకే తమిళ భాషను సెమ్మొళిగా మార్చడానికి కృషి చేసిందని పేర్కొన్నారు.

నీట్‌తో విద్యార్థులకు నష్టం కలుగుతుందని న్యాయస్థానం సైతం గుర్తించిందని, అయితే రాష్ట్రంలోని పాలకులు దీని గురించి పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి దిల్లీలో ప్రధాని మోడీతో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నీట్‌ కు వ్యతిరేకంగా ఎటువంటి తీర్మాణం చేయాలని ఆరోపించారు. జల్లికట్టుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పోరాడిన విధంగా హిందీకి - నీట్‌ కు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం కారణంగా 1967లో తమిళనాడులో ప్రభుత్వ మార్పు జరిగిన విషయాన్ని స్టాలిన్ ఈ సంద‌ర్భంగా గుర్తుచేయ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/