Begin typing your search above and press return to search.

అచ్చెన్నను తప్పిస్తున్నారా ?

By:  Tupaki Desk   |   28 May 2022 11:30 AM GMT
అచ్చెన్నను తప్పిస్తున్నారా ?
X
పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి స్ధానంలో కొత్త నేతను అధ్యక్షుడిగా నియమించాలని పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కళావెంకటరావు ప్రతిపాదించినట్లు మీడియా, సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.

శుక్రవారం రాత్రిజరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో అధ్యక్షుడి మార్పు విషయంలో కళా వెంకటరావు ప్రతిపాదన చేసిన విషయం బయటపడింది. దాంతో అచ్చెన్నను తప్పించే విషయంలో ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.

అచ్చెన్న ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేత. కొత్తగా నియమితులవ్వబోయే అధ్యక్షుడిని రాయలసీమ లేదా కోస్తా జిల్లాల నుండే ఎంపిక చేయాలనే చర్చ కూడా జరిగిందట. కొత్త అధ్యక్షుడు ఏ ప్రాంతం వారైనా బీసీ సామాజికవర్గం నుండే ఉంటారని పార్టీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బీసీలకు వైసీపీ పెద్దపీట వేస్తోందని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పాలిట్ బ్యూరోలో చర్చ జరిగిందట. అందుకనే జగన్ ప్రచారానికి ధీటుగా టీడీపీ కూడా బీసీలకే మళ్ళీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని స్ధూలంగా డిసైడ్ అయ్యిందట.

దూడుకుగా ఉండటం అచ్చెన్న సహజ స్వభావం. ఇదే విషయమై అచ్చెన్నకు లోకేష్ కు మధ్య గ్యాప్ పెరగటానికి కారణమైందట. పైగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో టిఫెన్ తింటున్న సమయంలో 'పార్టీలేదు బొక్కాలేదు' అన్న కామెంట్లు పార్టీకి బాగా డ్యామేజ్ చేసింది. అలాగే కుప్పం మున్సిపాలిటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అచ్చెన్న చేసిన కామెంట్ చంద్రబాబును ఇరకాటంలో పడేసింది.

ఇలాంటి అనేక కారణాలతో అచ్చెన్న స్ధానంలో కొత్త బీసీని అధ్యక్షుడిగా నియమించాలని లోకేష్ బాగా పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ పదవులకు సీనియర్లను తప్పించి కొత్తవారికి ఇవ్వాలని లోకేష్ చెప్పారట. సరే కారణాలు ఏవైనా మహానాడు సందర్భంగా పార్టీకి కొత్త అధ్యక్షుడు రావటం ఖాయమని పార్టీ నేతల మధ్య చర్చలైతే బాగా పెరిగిపోతోంది. మరి చివరకు చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.