Begin typing your search above and press return to search.

అక్కడి తెలుగోళ్లు విమాన టికెట్లు కొనలేని దుస్థితిలో ఉన్నారా?

By:  Tupaki Desk   |   10 May 2020 4:46 AM GMT
అక్కడి తెలుగోళ్లు విమాన టికెట్లు కొనలేని దుస్థితిలో ఉన్నారా?
X
ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. పరిస్థితులు తలకిందులుగా మారిపోతున్నాయి. తాజా పరిణామాలతో సొంతూళ్లకు.. అయినోళ్ల వద్దకు వచ్చేందుకు దేనికైనా సిద్దమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీలు.. శ్రామికులు.. సొంతూళ్లకు పోయేందుకు వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న ఘటనల్ని చూస్తున్నాం.

ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నా.. నడకను నమ్ముకొని ఊళ్లకు వెళుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఇదిలా ఉంటే.. విదేశాల్లో ఉన్న వారు దేశానికి తిరిగి వచ్చేలా కేంద్రం ఓకే చెప్పటం తెలిసిందే. ఇలాంటివేళ.. గల్ఫ్ లో ఉన్న తెలుగువారు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు వచ్చేందుకు రెఢీ అవుతున్నారు. కానీ.. వారికి ఊహించని షాకులు ఎదురవుతున్నాయి.

విమాన టికెట్ల ధరల్ని పెంచేయటం ఒక తలనొప్పి అయితే.. కార్డు కాదు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటామన్న రూల్ ను పెట్టటంతో చాలామంది టికెట్లు కొనలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. రెండు నెలలుగా ఉద్యోగాలు లేకపోవటం.. ఉన్న కొద్దిపాటి డబ్బులు అయిపోవటం.. ఫారిన్ నుంచి వచ్చిన వారికి పే క్వారంటైన్ కు ప్రభుత్వం సిద్ధం చేయటంతో.. చేతిలో డబ్బులు ఉంటే తప్పించి విదేశాల నుంచి రాలేని పరిస్థితి నెలకొంది.

క్వారంటైన్ ఖర్చుల్ని భరించలేని చాలామంది తెలుగు వారు గల్ప్ దేశాల నుంచి బయలుదేరేందుకు సిద్దంగా లేరని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంత ఖర్చు కైనా వెనుకాడకుండా విమానాల్లో వస్తున్న వారికి ఊహించని షాకులు తగులుతున్నాయి. విమానంలోని మూడు సీట్ల మధ్య ఎలాంటి దూరం ఉంచకుండా.. వరుసగా మూడు సీట్లలో ముగ్గురిని ఉంచేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భౌతిక దూరం లేకుండా విమానాల్ని ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. గల్ఫ్ దేశాల్లోని ప్రభుత్వాలు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారిలో చాలామంది ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని.. వారిని ఎవరూ ఆదుకోవటం లేదంటున్నారు.