Begin typing your search above and press return to search.

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రం గుర్రు: కృష్ణా బోర్డు రద్దుకు యోచ‌న‌

By:  Tupaki Desk   |   12 Jun 2020 3:30 PM GMT
ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రం గుర్రు: కృష్ణా బోర్డు రద్దుకు యోచ‌న‌
X
దక్షిణ భారతదేశంలో ప్రధాన నది కృష్ణ. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జీవ నదిగా కొనసాగుతోంది. ఈ నది బిరబిరా పరుగులు పెడుతూ ప్రజల సాగు, తాగునీటితో పాటు విద్యుచ్చక్తికి కీలకంగా ఉంది. అయితే ఈ నదిపై రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నీటి పంచాయితీ కేంద్రం వద్దకు వెళ్లినా అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఈ నదీజలాలపై ఏర్పాటుచేసిన కృష్ణా బోర్డు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ నేపథ్యంలో ఆ బోర్డును రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దాని స్థానంలో ప్రత్యేక ఆథారిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇదే విషయం నెల రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి శాఖ అధికారులు చర్చలు చేస్తున్నారు. కృష్ణా బోర్డు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నదుల బోర్డులు ఉన్నా వాటికి ఎలాంటి అధికారాలు లేకపోవడం, బోర్డుల సూచనలు, ఆదేశాలను రాష్ట్రాలు పట్టించుకోకపోవడం, బేసిన్‌లో కొన్ని రాష్ట్రాలకు ఈ బోర్డుతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కేంద్రం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే కృష్ణా బోర్డు తీసేసి అథారిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణ, నీటి విడుదల వంటి అంశాల్లో కేంద్రం పాత్ర లేకపోవడం ప్రధానంగా గుర్తించింది. నీళ్ల విషయంలో కూడా రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చర్యలు చేపట్టింది.

కృష్ణా బోర్డు రద్దు చేసి అథారిటీ ఏర్పాటు చేస్తే దీని పరిధిలోకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వస్తాయి. అధికారాలు ఉండడంతో రాష్ర్టాలపై పెత్తనం చేయవచ్చు. ఇప్పుడు బోర్డు ఉన్నా రాష్ట్రాలు మాట వినడం లేదు. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నా బేఖాతర్ చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి ఎప్పుడు ఏ మేర నీరు వదలాలన్న విషయంలో బోర్డుకు స్పష్టత లేదు. మ‌హారాష్ట్ర, కర్ణాటక మ‌ధ్య వివాదాలు, తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వాగ్వాదం ఉన్న విష‌యం తెలిసిందే. బోర్డు విచార‌ణ చేసి ఆదేశాలు జారీ చేస్తుంది.. కానీ పాటించ‌క‌పోతే క‌ఠిన చర్య‌లు తీసుకునే అవ‌కాశ‌మే లేదు. ఈ కారణాలతో కృష్ణా బేసిన్‌ మొత్తానికి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

బోర్డు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా కేంద్ర జల శక్తి అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, వాటి ఆయకట్టు, వాటి నీటి వాడకంతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటి నీటి అవసరం వంటి సమస్త సమాచారాన్ని సమర్పించాలని కృష్ణా బోర్డును కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాగునీటి వివాదాల ట్రైబ్యునల్స్‌ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లు కూడా పెట్టారు. ఇది ఆమోదం పొంది అమల్లోకి వస్తే దేశంలోని నీటి వివాదాలన్నింటినీ ఒకే ట్రైబ్యునల్‌ పర్యవేక్షించనుంది. ప్రస్తుతం కృష్ణా జల వివాదాలకు కృష్ణా ట్రైబ్యునల్‌ ఉంది. అలాగే ఇతర బేసిన్లలోని నీటి వివాదాల పరిష్కారానికి వేర్వేరు ట్రైబ్యునల్స్‌ ఉన్నాయి. వీటికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని ఖరారు చేయడానికి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అమల్లో ఉంది. కేంద్రం చట్టం అమల్లోకి వస్తే కృష్ణా ట్రైబ్యునల్‌ కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ ట్రైబ్యునల్‌లో విలీనం కానుంది. కృష్ణా, తుంగభద్ర బోర్డులను రద్దుచేసి, వాటి స్థానంలో కృష్ణా బేసిన్‌ ఆథారిటీని ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అందులో చేరుస్తారు. ఈవిధంగా త్వ‌ర‌లోనే ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

అయితే కృష్ణా బోర్డు ర‌ద్దు చేసి అథారిటీ ఏర్పాటుచేస్తే ఇక రాష్ట్రాలు త‌ప్ప‌నిస‌రిగా కేంద్ర అనుమ‌తులు పొందాల్సిందే. కేంద్రం చెప్పిన‌ట్టు వినాల్సిందే. ఆ విధంగా చ‌ట్టం రూపొందించే ప‌నిలో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే విద్యుత్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లుతో రాష్ట్రాల నెత్తిపై పిడుగు వేస్తున్న కేంద్రం ఇప్పుడు న‌దుల బోర్డు ర‌ద్దుతో రాష్ట్రాల‌ను త‌న గుప్పిట్లోకి పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఉమ్మ‌డి అంశాల‌ను క్ర‌మంగా కేంద్రం త‌న చేతిలోకి తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ నిర్ణ‌య‌మ‌ని విశ్లే‌ష‌కులు, నిపుణులు చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణా బేసిన్‌లో రాష్ట్రాల వాటా

మ‌హారాష్ట్ర 585
క‌ర్నాట‌క 734
తెలంగాణ 299
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 512