Begin typing your search above and press return to search.

బీజేపీ పాలిత రాష్ర్టాల వ‌ల్లే స‌మ‌స్య‌లు

By:  Tupaki Desk   |   24 April 2018 10:13 AM GMT
బీజేపీ పాలిత రాష్ర్టాల వ‌ల్లే స‌మ‌స్య‌లు
X
ప్ర‌ధాన‌మంత్రి స‌న్నిహితుడనే పేరున్న నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ చైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్న నీతిఅయోగ్‌ కు సీఈఓగా ఉన్న కాంత్‌...బీజేపీ నేత‌ల‌కు మంట పుట్టించే మాట‌లు మాట్లాడారు. దేశం గురించి ఆయ‌న చేసిన విశ్లేష‌ణ‌లో ఐదు బీజేపీ పాలిత రాష్ర్టాలు - ఒక బీజేపీ దోస్తీ ఉన్న రాష్ట్రం వ‌ల్లే దేశం వెనుక‌బ‌డిపోయింద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో జ‌రిగిన‌ కార్యక్రమానికి అతిథిగా హాజ‌రైన సంద‌ర్భంగా అమితాబ్ కాంత్‌ మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశం ముందుకు వెళ్తున్నదని, కానీ సామాజిక అభివృద్ధి అంశాల్లో మనం ఇంకా వెనుకబడే ఉన్నామని అమితాబ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హ్యూమన్ డెవలప్‌ మెంట్ ఇండెక్స్‌ లో భారత్ 131వ ర్యాంక్‌ లో ఉన్నదని ఆయన గుర్తు చేస్తూ ఈ విష‌యాన్ని పేర్కొన్నారు.

మాన‌వ అభివృద్ధి సూచి దక్షిణ - పశ్చిమ రాష్ర్టాలు మెరుగ్గా రాణిస్తున్నాయని, ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని నీతి అయోగ్ సీఈఓ అన్నారు. అదే స‌మ‌యంలో బీహార్ - యూపీ - చత్తీస్‌ ఘడ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ లాంటి రాష్ర్టాల వల్లే దేశం వెనుకబడిపోయిందని తెలిపారు. సామాజిక అంశాల్లో ఈ రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ర్టాల్లో ఒక్క బీహార్ మిన‌హా అన్నింటా బీజేపీ ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. బీహార్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీయే ప్ర‌స్తుతం అధికారంలో ఉండ‌టం గ‌మ‌నించాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

త‌న అభిప్రాయాన్ని మ‌రింత‌గా వివ‌రిస్తూ...మానవాభివృద్ధి సూచీ(హెచ్‌ డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్‌ 131వ స్థానంలో ఉందని హెచ్‌డీఐలో భారత్‌ స్థితి మెరుగుపడితేనే సామాజిక సూచీ విషయంలో తాము ఏమైనా చేయగలుగుతామన్నారు.. అప్పటిదాకా పరిస్థితుల్లో మార్పుండని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ర్టాలు త‌మ ప‌రిపాల‌న విధానాల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని ఆయన ఆకాంక్షించారు. ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతోంది. చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మహిళల విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అమితాబ్ కాంత్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.