Begin typing your search above and press return to search.

హ‌వ్వ‌..! వైసీపీలో ఉండి టీడీపీకి మ‌ద్ద‌తా? ఆ ఎంపీకి క్లాస్ త‌ప్ప‌దా!?

By:  Tupaki Desk   |   13 Feb 2021 3:30 AM GMT
హ‌వ్వ‌..! వైసీపీలో ఉండి టీడీపీకి మ‌ద్ద‌తా? ఆ ఎంపీకి క్లాస్ త‌ప్ప‌దా!?
X
రాష్ట్రంలో అధికార వైసీపీకి, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య భీక‌ర వైరం సాగుతున్న విష‌యం తెలిసిందే. తెల్లారి లేచింది మొద‌లు రెండు పార్టీల నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పైచేయి సాధించేందుకు ఇరు ప‌క్షాలూ.. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లోనూ తిట్టుకుంటున్నారు. తాజాగా కూడా టీడీపీపై వైసీపీ మంత్రులు.. తీవ్రంగా ఫైర‌య్యారు.రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. లెక్క‌చేయ‌కుండా.. విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉన్నారు వైసీపీ నాయ‌కులు.

మ‌రి ఇంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు ఎవ‌రైనా టీడీపీ వారికి మ‌ద్ద‌తు ఇస్తారా?! డామిట్‌!! ఈ మాట‌ను అనేందుకు, వినేందుకు సైతం ఎంత ధైర్యం కావాలి! అంటారా? కానీ.. ఆ పోలీస్ ఎంపీ మాత్రం అక్షరాలా ఇదే చేసారంటూ ప్రచారం జరుగుతుంది . గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు.. ఆయ‌నో స‌ర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్‌. మంచి ఫైర్ బ్రాండ్‌. ఎవ‌రిపైనైనా లాఠీతో విరుచుకుప‌డే.. అల‌వాటున్న అధికారిగా.. పోలీసుల రికార్డుల‌కెక్కారు. అలాంటి ఫైర్ బ్రాండ్ వైసీపీలో ఉంటే బాగుంటుంద‌ని.. జ‌గ‌న్ ఏరికోరి.. తెచ్చుకున్నారు. ఆయ‌నే హిందూపురం పార్లమెంటు నుంచి విజ‌యం సాధించిన కుర‌బ సామాజిక వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్‌!

పోలీసు అధికారిగా.. సీత‌య్య అనే పేరు తెచ్చుకున్న ఎవ‌రి మాటా విన‌ని మాధ‌వ్‌.. ఇప్పుడు వైసీపీలోనూ అదే ధోర‌ణితో ముందుకు సాగుతున్నాడు. మ‌రీ ముఖ్యంగా అనంపురంలో జేసీ దివాక‌ర్ రెడ్డి వంటి దిగ్గ జ రాజ‌కీయ నేత‌తో సై అంటే సై అని రోడ్డెక్కి.. రాజ‌కీయం చేశాడు. ఇప్పుడు వైసీపీలోనూ ఉంటూ.. టీడీపీకి మద్దతు ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో.. మాధ‌వ్ త‌న‌‌ స్వగ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి టీడీపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చాడట అని చెప్పుకుంటున్నారు. వాస్త‌వానికి ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీని నిలువ‌రించాల‌ని వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే.. దీనికి విరుద్ధంగా మాధ‌వ్ వ్య‌వ‌హ‌రించాడు అని ప్రచారం జరుగుతుంది .

గోరంట్ల మాధవ్‌ది కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం. అక్కడ టీడీపీ మద్దతు అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గోరంట్ల మాధవ్‌కు దగ్గర బంధువట‌! దీంతో వెన‌కా ముందు చూసుకోకుండా.. పార్టీ అధినేత‌జ‌గ‌న్ ఆదేశాల‌ను సైతం ప‌క్క‌న పెట్టి.. మధుకు మాధవ్ మద్దతు ఇచ్చేసిన‌ట్టు ప్రచారం జరుగుతుంది . దీంతో ఈ సీటు ఏకగ్రీవం అయింది. ఇంకేముంది.. ఇప్ప‌టికే మాధ‌వ్‌పై కారాలు మిరియాలు నూరుతున్న వైసీపీలోని ఓ వ‌ర్గం.. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీని సమర్ధించకుండా బంధువుకు మద్దతిచ్చారంటూ వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.

వెంట‌నే ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా తెలిసింది. అయితే మాధవ్ మాత్రం తాను తన నియోజకవర్గం ఎన్నికలలో బిజీగా ఉన్నాన‌ని… రుద్రవరం ఎన్నికలతో తనకు సంబంధం లేదని చెప్పుకొస్తున్నారట. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలోని ఇత‌ర వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌డం లేదు. ఆయ‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం మ‌రింత హీటెక్కింది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!!