Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణ‌యం మ‌న‌ల్ని స‌ర్వ‌నాశనం చేస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   5 July 2017 6:31 AM GMT
ట్రంప్ నిర్ణ‌యం మ‌న‌ల్ని స‌ర్వ‌నాశనం చేస్తుంద‌ట‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రముఖ బ్రిటీష్‌ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ తప్పుబట్టారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందంపై ఒప్పందం నుంచి తప్పుకోవటం ద్వారా, ట్రంప్‌ భూమండలాన్ని ప్రమాదపు అంచుల్లోకి తోసేశారని విమర్శించారు. తీక్షణమైన వేడితో కూడుకున్న శుక్రగ్రహం మాదిరి భూమికూడా మారే ప్రమాదముందని హెచ్చరించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో అమెరికా కొనసాగటం వల్ల ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలేమీ దెబ్బతినవని చెప్పారు. 'బీబీసీ'తో ఆయన మాట్లాడుతూ ట్రంప్ తీరును ఖండించారు.

పర్యావరణ ముప్పును తప్పించుకోవాల్సింది పోయి నష్టపరిచే నిర్ణయాన్ని ట్రంప్‌ తీసుకున్నారని స్టీఫెన్ హాకింగ్ అన్నారు. ''భూతాపం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రుడుపై సగటు ఉష్ణోగ్రత 220 డిగ్రీల సెల్సీయెస్‌ ఉంటుంది. ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఇలాంటి స్థితికి భూమి చేరుకుంటుందేమోనన్న భయం నాలో ఉంది. భూమిలాంటి మరో గ్రహం కనుగొనాలన్న మానవుడి లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఇలాంటి తరుణంలో మానవ సమాజానికి పర్యావరణ మార్పులు పెద్ద సవాల్‌గా మారుతాయని నా అంచనా. అయితే మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆ అవకాశం ఇంకా ఉంది. పర్యావరణ ముప్పును తప్పించుకోవాల్సింది పోయి ఎంతో అందమైన మన భూమండలాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని ట్రంప్‌ తీసుకున్నారు. మన పిల్లలు, ఆ తర్వాత వచ్చే భవిష్యత్‌ తరాల వారికి పర్యావరణ ముప్పు రాకుండా చేసే అవకాశాన్ని ట్రంప్‌ నిరాకరించారు'' అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు...భూమిపై మానవ మనుగడకు గడవు దగ్గరపడిందని నిరాశగా హ్యాకింగ్‌ సమాధానమిచ్చారు. మిలటరీని విపరీతంగా ఆధునీకరించటం, జనావాసాలపై దాడులు జరపటం తీవ్రమైన నష్టాల్ని తెచ్చిపెడుతోందన్నారు. అంతరిక్షంలో స్వతంత్ర కాలనీలు ఏర్పాటుచేసుకోవటం ద్వారా మానవ మనుగడ కొనసాగొచ్చునని అభిప్రాయపడ్డారు. అలాగే బ్రెగ్జిట్‌ నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. బ్రిటీష్‌ సైన్స్‌ ఒంటరిదైపోతుందని హాకింగ్ అన్నారు.