Begin typing your search above and press return to search.

జడ్జి ఉంటేనే కోర్టు

By:  Tupaki Desk   |   25 Jun 2015 9:22 AM GMT
జడ్జి ఉంటేనే కోర్టు
X
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగిసింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో సోమవారం వరకూ మత్తయ్య అరెస్టుపై ఉన్న స్టే కొనసాగుతుంది. ఓటుకునోటు కేసులో తనను తప్పించాలని కోరుతూ మత్తయ్య కోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మత్తయ్య స్వ్కాష్ పిటిషన్ ను కొట్టి వేయాలని కోరుతూ స్టీఫెన్సన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు ఇరు పక్షాలవాదనలనూ విన్న అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు, విచారణ నుంచి జడ్జిని తప్పించాలని స్టీఫెన్ సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ పైన వివిధ కోర్టుల తీర్పును ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ న్యాయవాది ఉదహరిస్తున్నారు. కాగా,ఓటుకు నోటు కేసులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి జస్టిస్ బీ శివశంకర్ రావును తప్పుకోవాలంటూ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నిందితుడు మత్తయ్య హైకోర్టులో బుధవారం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలుచేసిన విషయం తెలిసిందే. తన పిటిషన్‌పై విచారణ నుంచి జస్టిస్ శివశంకర్‌రావు తప్పుకోవాల్సిన ఆవసరంలేదని, స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. తన పిటిషన్‌పై ఏపీ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్కార్యాలయానికి ఎటువంటి సంబంధంలేదని తెలిపారు. స్టీఫెన్‌సన్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఎత్తుగడ ఉందని వివరించారు.

న్యాయమూర్తిని తప్పుకోవాలనడం, మరో బెంచ్ ముందుకు తీసుకరావాలనడం న్యాయవాదుల ఎత్తుగడ మాత్రమేనని కౌంటర్‌లో మత్తయ్య వివరించారు. సుబ్రతోరాయ్ - సహారా కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని స్టీఫెన్పిటిషన్ తోసిపుచ్చాలని కోరారు. జడ్జిలను కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. 18వ తేదీన తన కేసు విచారణ జాబితాలో ఉందని, దాని గురించిఉదయం పదిన్నర గంటలకు ప్రస్తావించి తగిన సమయంలో విచారణ జరపాలని కోరటం తప్పేమీ కాదన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించకూడదే తప్ప, ఇతర రాష్ట్రాల విషయంలో కాదన్నారు.

కాగా ఈ వాదనల సమయంలో మత్తయ్య తరఫు న్యాయవాదిపై స్టీఫెన్సన్ న్యాయవాది తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో జడ్జి జోక్యం చేసుకుని సంయమనం పాటించాలని సూచించడంతో పాటు ... జడ్జి లేకుండా కోర్టు లేదని... కోర్టు గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోమని... నిబంధనల ప్రకారమే కోర్టు పనిచేస్తుందని చెప్పారు. జడ్జిని తప్పించాలని స్టీఫెన్సన్ కోరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.