Begin typing your search above and press return to search.

తంబీల మాటలు హద్దులు దాటుతున్నాయే

By:  Tupaki Desk   |   10 April 2015 10:30 PM GMT
తంబీల మాటలు హద్దులు దాటుతున్నాయే
X
శేషాచల అడువుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తటం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి ఏపీ పోలీసులు.. అటవీ శాఖాధికారులు కాల్పులు జరపటం.. అందులోమరణించిన వారంతా తమిళనాడుకు చెందిన వారు కావటం తెలిసిందే.

దీనిపై నిరసన వ్యక్తం చేయటం.. అగ్రహం వ్యక్తం చేయటం వరకు వెళ్లిన తమిళులు.. తాజాగా తమిళనాడులోని తెలుగువారిపై దాడి చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక తమిళనాడు వస్తే భౌతికదాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఆవేశానికి హద్దులు ఉంటాయి. కానీ.. వాటిని దాటేసి మరీ మాటల తూటాలు మంచివి కావన్న విషయాన్ని తమిళులు మర్చిపోతున్నారు. మంచి పని చేస్తున్న వారిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయలేదన్న విషయం మర్చిపోకూడదు. ఇప్పటికే వేలాది మంది శేషాచల అడవుల్లో చేరి దొంగతనంగా విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయటం.. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులపై మారణాయుధాలతో దాడి చేయటం లాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తమ వాళ్లు చేసిన తప్పుల్ని పట్టించుకోకుండా.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టేలా కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న అత్యుత్సాహ ప్రకటనల్ని ఆరాష్ట్ర సర్కారు అడ్డుకోవాల్సిన అవసరంఉంది. ఎన్‌కౌంటర్‌లో తప్పులు ఉంటే న్యాయపరంగా పోరాటం చేయాలి. అంతేతప్ప ఏపీ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వస్తే భౌతికదాడులకు పాల్పడతామని హెచ్చరించటంలో అర్థం ఏముంది?

తమిళర్‌ విడుదలై కజగం పార్టీ నేతలు తాజాగా రైలురోకోను నిర్వహించి.. ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్‌ లోని నిజానిజాలు విచారణలో బయటపడతాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్‌కౌంటర్‌ లేదని వాదించే వీర ప్రజాస్వామ్య వాదులు.. ఇలా దాడులు చేస్తాం.. భయభ్రాంతులకు గురి చేస్తామని ఎలా వార్నింగ్‌ ఇవ్వగలుగుతున్నారు? మిగిలిన వారికి ఒక న్యాయం.. తమకో న్యాయం ఉండాలని వారు భావిస్తున్నారా?